మూడో రోజుకు చేరిన కేజీబీవీ సిబ్బంది దీక్ష | - | Sakshi
Sakshi News home page

మూడో రోజుకు చేరిన కేజీబీవీ సిబ్బంది దీక్ష

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

పార్వతీపురం రూరల్‌: సాలూరు మండలం కరాసువలస కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) ప్రిన్సిపాల్‌ సహా ఇతర సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు శిబిరం వద్ద గళమెత్తారు. చిన్నపాటి కారణాలతో మహిళా ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరికాదని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. బాధితుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి.శ్రీను నాయుడు, ఎం.భాస్కర రావు, పీడీఎస్‌ఓ కార్యదర్శి కె.సోమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు తీళ్ల గౌరీ శంకర్‌ రావు, చొక్కాపు వెంకట రమణ, పట్లా సింగ్‌ రవికుమార్‌ పాల్గొన్నారు. వారితో పాటు ఏఐటీయూసీ నేత ఆర్వీఎస్‌ కుమార్‌, సీపీఐ (లిబరేషన్‌న్‌) సభ్యులు పి.సంగం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథ రావు, పౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసి రావు, బంకురు సూరిబాబు, గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు రంజిత్‌ కుమార్‌ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement