50 ఏళ్ల వారిని.. ఏడిపింఛెన్‌..! | - | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల వారిని.. ఏడిపింఛెన్‌..!

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

50 ఏళ్ల వారిని.. ఏడిపింఛెన్‌..!

నెరవేరని చంద్రబాబు పింఛన్‌ హామీ

ఆవేదనలో పింఛన్‌ అర్హులు

23 నెలలుగా ఓపెన్‌ కాని పింఛన్‌ వెబ్‌సైట్‌

స్వీకరించని కొత్త దరఖాస్తులు

50 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ దూరం

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకూ మంజూరుకాని కొత్త పింఛన్లు

వితంతువులను ఆదుకోవాలి

వీరఘట్టం:

తమ్ముళ్లూ... ఊరూరా, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి.. ప్రజలందరికీ తెలియజేయండి.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్ల వయస్సునిండిన బడుగుబలహీన వర్గాలవారందరికీ రూ.4వేలు పింఛన్‌ అందిస్తాం.

– ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం

చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్నా 50 ఏళ్ల వయస్సు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హులైన ఒక్కరికీ కొత్త పింఛన్‌ మంజూరు కాలేదు. కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. చంద్రబాబు హామీ ఇచ్చారని, పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకూ పింఛన్లు మంజూరుకాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఎలా బతికేదంటూ గగ్గోలు పెడుతున్నా ఓట్లు వేయించుకున్న పాలకులు కనీసం స్పందించడం లేదు. వారి ఆవేదన వినడం లేదు. హామీలతో నమ్మించి చంద్రబాబు నిలువునా ముంచేశారంటూ కన్నీరుపెడుతున్నారు. మరోవైపు కొందరి పింఛన్లు రద్దు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి...

పార్వతీపురం మన్యం జిల్లాలో 50 ఏళ్ల వయస్సు దాటిన వారు 1,32,512 మంది ఉండగా 60 ఏళ్లు దాటిన వారు 87 వేల మందికి పైబడి ఉన్నారు. వీరిలో సుమారు 40 వేల మంది కొత్త పింఛన్లు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోతోంది. చంద్రబాబునాయుడు ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేశారని వాపోతున్నారు.

గతంలో ప్రతీ ఆరు నెలలకు...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందజేసింది. మొదటి మూడేళ్ల పాటు ప్రతి మూడు నెలలకోసారి చొప్పున అర్హులను ఎంపిక చేసి నూతన పింఛన్లు మంజూరు చేసేది. ఆ తర్వాత 2022–23లో ప్రతీ ఆరు నెలలకు అర్హులైన వారు నష్టపోకుండా వలంటీర్లతో ఎంపికచేసి పింఛన్లు అందజేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు.

భర్తలు చనిపోయి వితంతువులుగా ఉన్న చాలా మంది పింఛ న్ల కోసం ఎదురుచూస్తున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడ బిడ్డలను ఆదుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది, అర్హులందరికీ ప్రభుత్వం నూతన పింఛన్లు అందజేయాలి. ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్ల నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాలి. ఆరునెలలకోసారైనా కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– జంపు కన్నతల్లి, జెట్పీటీసీ సభ్యురాలు,

వీరఘట్టం

Advertisement
 
Advertisement
Advertisement