పార్వతీపురం: జనగణన–2027లో భాగంగా స్వీయగణ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి కోరారు. ఈనెల 16 నుంచి ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజలు హెచ్‌టీటీపీఎస్://ఎస్‌ఈ.సెన్‌సెస్.జీఓవీ.ఇన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కోరారు.
● భగీరథ మహర్షి జయంతిని కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
● కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డులకు జూలై 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. భారత హోం మంత్రిత్వశాఖ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మ భూషన్, పద్మశ్రీ)లను ప్రకటిస్తుందన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారు హెచ్‌టీటీపీ://అవార్డ్సు.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు సమర్పించాలన్నారు.
మృత్యు‘ధార’..
శృంగవరపుకోట: మృత్యువు ఏ రూపంలో.. ఎవరిని ఎలా కాటేస్తోందో తెలియదు. దీనికి ఎస్.కోటలో మంగళవారం జరిగిన విద్యుత్ ప్రమాదమే నిలువెత్తునిదర్శనం. కొత్తూరు గ్రామానికి చెందిన కక్కల రాము (48) అదే గ్రామంలో బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఏళ్ల తరబడి చేస్తున్న అలవాటైన పని. ఎప్పటివలే బైక్‌కు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న ప్రయత్నంలో గన్‌ను పైకిలేపాడు. అంతే.. నీటిధారపైన ఉన్న విద్యుత్ లైన్‌ను తాకింది. దానిగుండా విద్యుత్ ప్రవహించడంతో వెంటనే రాము షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొనఊపిరితో ఉన్న రామును ఎస్.కోటలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తె, కుమారునికి వివాహాలు అయ్యాయి. బైక్ సర్వీసింగ్ కార్మికుడి మృతితో కొత్తూరులో విషాదం అలుముకుంది.
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారు
రేగిడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రెండేళ్లుగా రెడ్‌బుక్ పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. రేగిడిలో స్థానిక విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. అధికార దాహంకోసం సూపర్‌సిక్స్ హామీలిచ్చి అమలులో చేతులెత్తేయడం విచారకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ఎంపీటీసీ కింజరాపు సురేష్, పాడి లక్ష్మునాయుడు, కెంబూరు వెంకటేశ్వరరావు, గార రమణ, టంకాల బుచ్చెన్నాయుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
దేవదాయ భూముల వేలంలో ఉద్రిక్తత
గజపతినగరం రూరల్: మండలంలోని పీ.ఎస్.ఆర్ పురం గ్రామంలోని 47 ఎకరాల దేవదాయశాఖ భూములకు మంగళవారం నిర్వహించిన కౌలు వేలంటపాట ఉద్రిక్తతగా మారింది. భూములను సాగుచేస్తున్న 19 మంది కౌలు రైతులు వేలంపాట నిర్వహించిన సచివాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. 70 ఏళ్లుగా భూములు సాగుచేస్తున్నామని, ఏటా ఠంచన్‌గా దేవదాయ శాఖకు కౌలు చెల్లిస్తున్నామని, వేలంపాట లేకుండా తమకే కౌలుకు ఇవ్వా లని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్‌ప్రసాద్, శ్రీరామ్‌లు మాట్లాడుతూ ఇన్‌చార్జి ఈఓలు ఉండడం వల్ల ప్రతి మూడేళ్లకు నిర్వహించాల్సిన వేలంపాట 12 ఏళ్లుగా నిర్వ హించలేదని, వేలంపాటకు రైతులు సహకరించాలని కోరారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు సైతం సర్దిచెప్పారు. వేలంపాటలో పాల్గొని భూ ములను కౌలుకు తీసుకోవాలని సూచించారు. దీనికి రైతులు ససేమిరా అనడంతో మరో పది రోజులు గడువు ఇస్తామని, వేలంపాట పాడిన వారికే భూములను కౌలుకు ఇస్తామని చెబుతూ దేవదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు.


