రైతులకు పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

రైతులకు పంట నష్టం

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

గజరాజుల

బీభత్సం

గరుగుబిల్లి: జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా సంచరిస్తున్న గజరాజులు అటు పంటలను నష్టపరచడంతోపాటు ప్రజల ప్రాణాలనుకూడా తీస్తున్నాయి. కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, సీతానగరం, పార్వతీపురం మండలాలల్లో ఏనుగులు సంచరిస్తున్నప్పటికీ వాటిని తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పంటలకు, ప్రాణాలకు ఏనుగులు నష్టం కలిగిస్తున్నా అధికారుల్లో ఎలాంటి చలనం ఉండడం లేదు. దీంతో ప్రజలకు కష్టం, నష్టం తప్పడంలేదు. తాజాగా గడిచిన వారం రోజులనుంచి గరుగుబిల్లి మండలంలోని మరుపెంట, సంతోషపురం, నందివానివలస, గొట్టివలస తదితర గ్రామాల పరిసరాల్లో సంచరించిన ఏనుగులు మంగళవారం ఉదయం నాటికి నాగూరులో సంచరించి మొక్కజొన్న, అరటి, వరిపంటలను ధ్వంసం చేసి రైతులను నష్ట పరిచి బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన కేతిరెడ్డి భార్గవరావు నాయుడు, కేతిరెడ్డి చంద్రమౌళి, కేతిరెడ్డి జానకమ్మ, వెంకటనాయుడు, అల్లు కృష్ణమూర్తినాయుడు, బర్ణికల పోలిశెట్టిలకు చెందిన పంటలను నాశనం చేశాయి. సుమారు ఒక ఎకరం వేరుశనగ, మూడు ఎకరాల మొక్కజొన్న, ఐదు ఎకరాల వరిపంట, అరటి పంటలను, ఒక విద్యుత్‌ మోటార్‌ను ఏనుగులు నాశనం చేశాయి. చేతికి అందిన పంట ఇలా గజరాజుల పాలవడంతో రైతులు తీవ్రంగా వాపోతున్నారు. భారీ పంటల నష్టంవల్ల ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందించాలంటూ బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement