సన్మార్గంతో జీవితానికి సార్థకత | - | Sakshi
Sakshi News home page

సన్మార్గంతో జీవితానికి సార్థకత

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

రామానుజ చిన జియర్‌స్వామి

పార్వతీపురం: సకల జీవరాశులను కాపాడేది శ్రీలక్ష్మీనారాయణుడే... సన్మార్గంలో వెళ్లినప్పుడు జీవితానికి సార్ధకత ఉంటుందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియర్‌స్వామి అన్నారు. బెలగాంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ శతాబ్ది ప్రయుక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శ్రీమత్తిరుమల రంగనాథాచార్యస్వామి పర్యవేక్షణలో సాగిన కార్యక్రమంలో మంగళవారం ఉదయం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు మంగళ వాయిద్యాల నడుమ మహిళల శోభాయాత్ర భక్తిభావంతో సాగింది. ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది. ఆలయంలోని శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి చినజీయర్‌ స్వామి సాలిగ్రామ మాల అలంకరణ చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జానియర్‌ కళాశాల మైదానంలో ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. ఆలయం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఎంతో వైభవంగా పూజలను చేయడం ఈ ప్రాంత ప్రజలకున్న భక్తిభావాన్ని చాటుతుందన్నారు. ప్రతి ఒక్కరిలో దేవుడు కొలువై ఉంటారని, ఆధ్యాత్మిక చింతనతో ఆనందమయ జీవనం కొనసాగించాలన్నారు. సన్మార్గాన్ని వీడరాదన్నారు. ఇందులో భాగంగా పలువురు చిన్నారులు వేంకటేశ్వరస్వామి, పద్మావతి, లక్ష్మీదేవి వేషధారణలో ఆకర్షించారు. కోలాట ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, ఆలయ అర్చకులు వరహ వెంకటగిరి ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు చీకటి బాలగంగాధర్‌ తిలక్‌ రాయ్‌, యిండుపూరు గున్నేశ్వరరావు, లక్ష్మణరావు, పైడాన అప్పారావు, తాడ్డి అప్పారావు, చెల్లారపు సాంబ, దొగ్గ జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement