సాక్షి, పార్వతీపురం మన్యం: పచ్చని మన్యంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 11 గంటల తర్వాత బయట తిరిగే సాహసం ఏ ఒక్కరూ చేయలేకపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటిపోతున్నాయి. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ తాజా నివేదిక ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలోని 15 మండలాలు ‘డేంజర్ కేటగిరీ’ (ప్రమాదకర స్థాయి)లో ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రాకపోవడం మంచిదని.. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
45 డిగ్రీలకు చేరువ..
పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు నుంచి 45–50 డిగ్రీలు వరకూ నమోదయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ మండలాలలో ఎండ ప్రభావం ఉండనుంది.
చల్లగా మారిన వాతావరణం..
మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ.. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. పార్వతీపురంతో పాటు పలు మండలాల్లో గాలులు వీచి, వర్షం కురవడంతో ప్రజలు ఊరట చెందారు.
జిల్లాకు వడగాల్పుల ముప్పు
15 మండలాల్లోనూ 41 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిక


