● సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు
మక్కువ: వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని కాలువల ద్వారా చెరువులకు విడిచిపెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఈ ఏడాది జనవరి నెల నుంచి ఇరిగేషన్ అధికారులు ఇష్టానుసారం సువర్ణముఖి, గోముఖి రెగ్యులేటర్ల ద్వారా నదుల్లోకి విడిచి పెట్టారన్నారు. నీటిని వృథాగా ఎందుకు విడిచిపెడుతున్నారని ప్రశ్నిస్తే జైకా నిధులతో కాలువల్లో పనులు చేస్తామని చెప్పినప్పటికీ, ఇంతవరకు కాలువల పరిధిలో జైకా నిధులతో పని జరిపించలేదన్నారు. ప్రాజెక్టు నీరు వృథాగా దిగువకు విడిచిపెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. రానున్న సీజన్‌లో ఎల్‌నినో ఏర్పడి భారతదేశం అంతా కరువు వస్తుందని పత్రికల్లో ప్రకటనలు చేస్తుంటే, ఇరిగేషన్ అధికారులు మాత్రం వెంగళరాయసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని వృధాగా విడిచి పెడుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయికట్టు చెరువులకు విడిచిపెడితే మూగ జీవాల దాహార్తిని అరికట్టడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు ఎన్‌వై నాయుడు, మండల నాయకుడు తాడంగి ప్రభాకర్ పాల్గొన్నారు.


