● నేడు చినజియర్ స్వామి రాక
● 29న స్వామివారి కల్యాణం
పార్వతీపురం: ఈనెల 22నుంచి జరగనున్న కల్యాణ వెంకటేశ్వరస్వామి శతాబ్ది బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈమేరకు స్థానిక జూనియర్ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 21న మంగళవారం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో మహిళలు కలశాలతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి, శ్రీవారికి సాలగ్రామ మాలను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినిజియర్ స్వామితో అలంకరణ చేయనున్నారు. అనంతరం చినజియర్ స్వామి ప్రవచనం, భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. ఆలయం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు కమిటీ సభ్యులు, ఆలయ అర్చకుడు వరహా వెంకటగిరి ఆచార్యులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం, తిరువీధులలో కోలాటం భజనలు నిర్వహించనున్నారు. అలాగే కళాశాల మైదాన ప్రాంగణంలో సాయంత్రం ప్రముఖులతో ప్రవచనాలు ఉంటాయి. ఇందులో భాగంగా 27న డా.గజల్ శ్రీనివాస్ గాన కచేరి, 29న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఉంటుంది. 29న ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు అధికంగా పాల్గొని స్వామి వారి తీర్ధప్రసాదాలను స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.


