మందులు కరువు..! | - | Sakshi
Sakshi News home page

మందులు కరువు..!

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

మూగజీవాలకు

సొంతంగా మందులు కొనుగోలు చేస్తున్న పాడి రైతులు

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో పాడి రైతులు తమ పశువులకు జబ్బు చేస్తే మందులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జబ్బు చేసిన పశువులను వైద్యశాలలకు తీసుకు వెళ్తే వైద్యం చేసి ఫలానా మందులు కొనుగోలు చేసి తీసుకురమ్మని పశువైద్య అధికారులతో పాటు సిబ్బంది సూచిస్తున్నారు. ఇది రైతులకు ఆర్థిక భారంగా మారింది. పాడి రైతుల సంక్షేమానికి పాటు పడతామని టీడీపీ సర్కార్‌ ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పింది. అయితే మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. కనీసం మూగజీవాలకు పూర్తి స్థాయిలో మందులు కూడా అందించలేని పరిస్థితిలో సర్కార్‌ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశు వైద్యశాలల్లో మందులు లేకపోవడంతో పాడి రైతులు మూగజీవాల వైద్యానికి ప్రైవేటు పశు మందుల దుకాణాల్లో కొనుగోలు చేసి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కాస్త పాడి రైతులకు ఇబ్బంది అయినా తప్పని పరిస్థితి.

జిల్లాలో పశువైద్యశాలలు

జిల్లాలో ప్రాంతీయ పశు ఆస్పత్రులు 13 ఉన్నాయి. గ్రామీణ పశు వైద్యశాలలు 40 ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ఒకటి ఉంది. పశు వైద్యశాలలు 64 ఉన్నాయి. సంచార పశు వైద్యశాలలు 13 ఉన్నాయి.

పశువులు వివరాలు

జిల్లాలో ఆవులు 3,77,960 ఉన్నాయి. గేదెలు 97,845 ఉన్నాయి. గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. పందులు 2585 ఉన్నాయి. కోళ్లు 51,26,764 ఉన్నాయి.

150 రకాల మందులు అందుబాటులో ఉండాలి

పశు వైద్యశాలల్లో 150 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ చాలా వరకు మందులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ పశు వైద్యశాలల పశు వైద్య సిబ్బందే మందులు పూర్తి స్థాయిలో లేవని, పాడి రైతులను మందులు కొనుగోలు చేసుకుని తెచ్చుకోమని చెబుతున్నట్టు తెలిసింది. పశువులు ఎదకు రావడానికి అవసరమైన మందులు, పశువులు జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగించే పౌడర్లు, పలు రకాల గాయాలకు, పుండ్లుకు ఉపయోగించే ఆయింట్‌మెంట్స్‌ తదితర పలు రకాల మందులు అందుబాటులో లేనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొన్ని రకాల మందుల కొరత వాస్తవమే..

పశు వైద్యశాలలన్నింటిలోనూ మందులు ఉన్నాయి. అయితే కొన్ని రకాల మందులు కొరత ఉంది. ప్రస్తుతం స్టాక్‌ వచ్చింది. ఆస్పత్రులకు పంపిణీ చేస్తాం.

– డాక్టర్‌ ఎన్‌.దామోదరరావు, జేడీ,

జిల్లా పశుసంవర్ధక శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement