పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ కె. హేమలత, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్‌లతో కలిసి పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 70 వినతులు స్వీకరించగా.. ఇందులో రెవెన్యూ సమస్యలు 18 కాగా.. మిగిలిన 52 ఇతర శాఖలకు చెందినవి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


