కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు

Mar 24 2026 8:06 AM | Updated on Mar 24 2026 8:06 AM

కబ్జాల నుంచి కష్టాల వరకు ఫిర్యాదులు

పార్వతీపురం రూరల్‌: జిల్లా కలెక్టరేట్‌ సోమవారం అర్జీదారులతో కిటకిటలాడింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు, సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై అధికారులకు వినతులు సమర్పించారు. కేబుల్‌ ప్రసారాల అంతరాయం నుంచి చెరువుల కబ్జాల వరకు, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల లేమి నుంచి వన్యప్రాణుల సంరక్షణ వరకు అనేక సమస్యలకు పరిష్కారం కోసం వినతులు అందజేశారు.

గంటకోసారి ‘ఫైబర్‌’ కట్‌.. ఆపరేటర్ల ఆవేదన

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (ఫైబర్‌ నెట్‌) నెట్‌వర్క్‌ తరచూ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇతర సంస్థల వైపు మళ్లుతున్నారని కేబుల్‌ ఆపరేటర్లు సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌కు విన్నవించారు. ఓఎల్టీలకు యూపీఎస్‌ సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్యని, వెంటనే ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆపరేటర్ల ఆదాయం నుంచి బాక్స్‌ రెంట్‌ పేరిట రూ. 59 అదనంగా మినహాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం వినియోగదారుల నుంచి పాత బాక్సులను రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

చెరువు కబ్జాలపై విచారణ చేపట్టాలి

పార్వతీపురం పట్టణంలోని నెల్లి చెరువు స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలపై విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్‌ చేశారు. చెరువు శిఖం భూమిలో సుమారు 20 పక్కా భవనాలు నిర్మించారని, వీటికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్‌ఓ కె. హేమలతకు వినతిపత్రం ఇచ్చారు.

పురిపాకలోనే పాఠశాల.. వసతులు కరువు

పార్వతీపురం మండలం కొత్తవూరు గిరిజన గ్రామంలో మౌలిక వసతుల లేమిపై గిరిజనులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పాఠశాల భవనం పూర్తికాకపోవడంతో విద్యార్థులు పురిపాకలో చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, ఇంటింటికీ కుళాయిలు, మురుగు కాలువలు, శ్మశానానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు.

వాణిజ్య గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించాలి

గత మార్చి నుంచి వాణిజ్య అవసరాల గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్ల నిర్వహణ కష్టతరంగా మారిందని జిల్లా హోటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. గ్యాస్‌ కొరత వల్ల తమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే సరఫరా పునరుద్ధరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement