పార్వతీపురం రూరల్: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని మన్యం కళావేదికలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా పండితుడు దార్లపూడి లక్ష్మీనరసింహారావు నూతన సంవత్సర రాశిఫలాలు, వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులపై పంచాంగ పఠనం చేశారు. అనంతరం కురుకుట్టి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. కవి సమ్మేళనంలో కవులు సిరికి స్వామినాయుడు, బౌరోతు శంకరరావు, కిలపర్తి దాలినాయిడు తమకవితలను వినిపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల ప్రాముఖ్యతను వివరించి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పండితులను, కవులను దుశ్శాలువలతో సత్కరించారు. జాయింట్ కలెక్టర్ సి.యస్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


