క్వింటా వద్ద
రూ.800 వరకు నష్టం
రైతన్నా..
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘రైతన్నా.. మీకోసం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజాప్రతినిధులను, అధికారులను గ్రామాలకు పంపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. ఆచరణలో అది ఒట్టిదేనని నిరూపితమవుతూనే ఉంది. పంటలకు మద్దతు ధర దక్కక రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకునేవారే లేరు. పంటను అమ్ముకునే అవకాశం లేక రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం తీరుతో మోసపోతున్నారు.
ఆశల పంట.. నష్టాల బాట
జిల్లాలో వరి తర్వాత అధిక శాతం మంది మొక్కజొన్ననే సాగు చేస్తుంటారు. వరి, పత్తితో పోల్చుకుంటే.. ఈ పంటలో కాస్త లాభాలు చూడవచ్చని ఆశ పడతారు. పార్వతీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, సీతంపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, తదితర ప్రాంతాల్లో ఎక్కువ సాగులో ఉంది. ఈ ఏడాది ప్రస్తుత సీజన్‌లో 31వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట వేశారు. తొమ్మిది లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు మధ్యవర్తులు, వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఏటా ప్రభుత్వం పేరుకే మద్దతు ధర ప్రకటిస్తున్నా.. మార్క్‌ఫెడ్ ద్వారా ఎక్కడా కొనుగోలు కేంద్రాలు మాత్రం కానరావడం లేదు.
నాసిరకం విత్తనాలతో దగా..
ఓ వైపు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దిగాలు చెందుతుంటే.. మరోవైపు నాసిరకం మొక్కజొన్న సీడ్ సరఫరాతో కొన్ని మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొమరాడ మండలంలోని గుణానపురం, గంగరేగువలస, దుగ్గికంభవలస, కల్లికోట, సోమినాయుడువలస తదితర గ్రామాల్లో నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. ఈ విత్తనాల వల్ల పొత్తుపై గింజలు పది లోపే ఉంటున్నాయి. దీనివల్ల ఎకరాకు రూ.లక్ష వరకు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాలకుపైగా ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట సీపీ ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బరావమ్మ, ఇతర నాయకులు కొమరాడ మండలంలోని సోమినా యుడువలస సమీపంలోని ఉన్న నాగభూషణం అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. నాసిరకం విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయిందని వారి ఎదుట రైతు వాపోయాడు. రైతులను మోసం చేసి, కావేరి సీడ్ యాజమాన్యం నాసి రకం విత్తనాలు సరఫరా చేసిందని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మొక్కజొన్న క్వింటాకు ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులకే విక్రయించుకోవాల్సి వస్తోంది. రూ.1,600 నుంచి రూ.1,700కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటా వద్ద రూ.800 వరకు రైతు నష్టపోతున్నాడు. అనేక కష్టనష్టాలకు ఓర్చి, బోరుబావుల వద్ద పంటను పండిస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట ఉంటే... ఎకరా విస్తీర్ణంలో 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఎకరా వద్ద రైతు దాదాపు రూ.25 వేల వరకు నష్టపోతున్నాడు. దళారులు, వ్యాపారులు తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నారు.


