అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం

Mar 19 2026 8:25 AM | Updated on Mar 19 2026 8:25 AM

అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం

రైతాంగం నడ్డివిరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతాంగాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పాలుజేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు... గడిచిన రెండేళ్లలో రూ.40వేలు జమ చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు కేవలం రూ.14వేలు మాత్రమే జమ చేశారన్నారు. కౌలురైతులకు పథకం అందని ద్రాక్షగా మార్చారని విమర్శించారు. పంట పండించేందుకు అవసరమైన యూరియా కావాలంటే రైతన్నలు లాఠీదెబ్బలు తినాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘాల ద్వారా రుణాలు అందక రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్నారు.

వివిధ రకాల పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలేక ఉగాదివేళ రైతన్నలు ఘోషిస్తున్నా ఎమ్మె ల్యేలు, మంత్రులు, అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు.

● జిల్లాలో వరి తరువాత అత్యధికంగా సాగుచేసే మొక్కజొన్న పంటకోత ప్రారంభమైందని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి క్వింటా రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

● పాలన ముగిసిన స్థానిక సంస్థల పాలకవర్గాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఐదేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థలైన విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల పాలకవర్గాలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement