పురం.. ఇక ప్రత్యేకమే! | - | Sakshi
Sakshi News home page

పురం.. ఇక ప్రత్యేకమే!

Mar 18 2026 7:49 AM | Updated on Mar 18 2026 7:49 AM

పురం.. ఇక ప్రత్యేకమే!

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పురాలపై వివక్ష ప్రారంభం అయ్యింది. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు మోకాలడ్డారు. ఫలితంగా పురపాలక సంఘాల్లో సమస్యలు పేరుకుపోయాయి. తాగునీటికీ ఇబ్బందులు పడే పరిస్థితి. అభివృద్ధికి సహకారం అందించాల్సింది పోయి.. పాలక వర్గాలను పడగొట్టేందుకే ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పార్వతీపురంలో పలువురు సభ్యులను తమవైపు తిప్పుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తగిన బలం లేక, భంగపాటుకు గురయ్యారు. సాలూరులో సైతం కొంతమందిని జనసేనలోకి లాక్కొని పాలకవర్గాన్ని ఇబ్బందులకు గురిచేశారు. పాలకొండలో కూడా చైర్‌ పర్సన్‌ రాధా కుమారి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించగా.. ఆ సీటు కోసం పెద్ద డ్రామానే నడిచింది. అడ్డదారిలో కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పురాల అభివృద్ధి కంటే అవరోధాలకే శాసన సభ్యులు ప్రాధాన్యమిచ్చారు.

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కాగా.. పాలకొండ నగర పంచాయతీగా ఉంది. 2021 మార్చిలో నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లతో పాలకవర్గాలు అప్పట్లో కొలువుదీరాయి. రిజర్వేషన్‌ ప్రకారం పాలకవర్గ సభ్యులు వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇద్దరు చొప్పున వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఐదేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే ప్రత్యేక అధికారులను నియమించింది. పార్వతీపురం పురపాలక సంఘానికి సంయుక్త కలెక్టర్‌.. సాలూరు, పాలకొండలకు సబ్‌ కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.

మారిన పట్టణ రూపు రేఖలు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పురాలు... వైఎస్సార్‌ సీపీ పాలక వర్గాల హయాంలో అభివృద్ధి బాట పట్టాయి. 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పూర్తి స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. పనులు వేగవంతం కావడంతో పట్టణాల రూపు రేఖలు మారాయి.

● పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో దాదాపు రూ.కోట్ల వ్యయంతో రహదారులు నిర్మించారు. తాగునీటి కోసం రూ.55 కోట్లు మంజూరు చేసి రూ.3 కోట్లతో పైపులైను కొనుగోలు చేశారు. దాదాపు 3 వేల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేశారు. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక అవస్థలు పడుతున్న నెల్లిచెరువు గట్టు నివాసులు 63 మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో అధ్వానంగా విడిచిపెట్టిన బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. గడపగడపకు కార్యక్రమం ద్వారా 30 వార్డుల్లో 12 కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించారు. రూ కోటీ 80 లక్షలతో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేశారు. కొత్తవలస చెరువును రూ.కోటి వ్యయంతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రూ.2.30 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ చేపట్టారు. జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయ్యింది.

● సాలూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఏఐఐబీ కింద రూ.63 కోట్లతో ఇంటింటికీ కుళాయి ప్రాజెక్టును తీసుకొచ్చారు. అప్పట్లోనే టెండర్లు కూడా పిలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన టిడ్కో గృహాలను పూర్తిచేసి, వందలాది మందికి సొంతింటి కలను నిజం చేశారు. ఈ పాలకవర్గ హయాంలోనే వంద పడకల ఆస్పత్రి 90 శాతం పూర్తయింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో పెద్ద ఎత్తున రహదారులు, డ్రైన్లు నిర్మించారు. మున్సిపాలిటీలో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రపతి అవార్డు, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా వరించాయి. మాజీ మంత్రి రాజన్నదొర సహకారంతో సాలూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పుర అధ్యక్షురాలు పువ్వుల ఈశ్వరమ్మ తెలిపారు.

– గత ఐదేళ్ల కాలంలో పాలకొండ నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పోతుల గెడ్డ ఖానా మీదుగా రూ.70 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టారు. ఏరియా ఆసుపత్రి మార్గంలో రూ.42 లక్షలతో సీసీ రహదారి పూర్తి చేశారు. ప్రధానంగా ఐదు వార్డులకు ఉపయోగపడేలా కనెక్టివిటీ రోడ్లు నిర్మించారు. రూ.50 లక్షల వ్యయంతో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ పూర్తి చేశారు. 20 వార్డుల్లో సుమారు 180 వీధులు ఉన్నాయి. 60 శాతం వీధుల్లో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించారు. రూ.70 లక్షలతో డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం చూపగా.. టీడీపీ వారు అడ్డుకున్నారు.

పురపాలక సంఘాల్లో ముగిసిన పాలక వర్గాల పదవీ కాలం

అభివృద్ధి కార్యక్రమాలతో మారిన పట్టణ రూపురేఖలు

కొవిడ్‌లో రెండేళ్లు గడ్డు కాలం

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత 20 నెలల్లో పాలక వర్గాలకు సహకారం కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement