పార్వతీపురం: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు.‘వడగాల్పుల నివారణ కార్యాచరణ ప్రణాళిక–2026’పై జిల్లా అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు కారణంగా ఒక్క ప్రాణం కూడా నష్టం జరగరాదని, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బకు గురైన వారికి తక్షణమే అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై గ్రామస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. వడగాల్పులు, పిడుగుల బారినుంచి రక్షణ పొందేలా కరపత్రాలను, ఐఈసీ మెటీరియల్‌తో ప్రజలను చైతన్య పరచాలన్నారు. మండలాల వారీగా ఉష్ణోగ్రత సూచీ, గరిష్ఠ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఎస్‌డీసీ ఎస్.దిలీప్‌చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
పాసుపుస్తకాల పంపిణీ వేగంగా పూర్తికావాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు, తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పరిస్థితులను సీఎస్‌కు కలెక్టర్ వివరించారు. ఈ వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా 9వ తేదీలోగా నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్లను వీలైనంత వేగంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు వెంకటేశ్వరరావు, సుధారాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రత్యేక
అధికారుల పాలన
● ముగిసిన కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన సాగనుంది.
విజయనగరం ఆర్డీఓగా సుధాసాగర్
విజయనగరం: విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా సనపల సుధాసాగర్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆర్డీఓ గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయనగరం ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.నూకరాజును అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూకరాజు నెల రోజుల వ్యవధిలో ఉద్యోగ విరమణ పొందనున్నారు.
ఫైర్ ఆఫీసర్‌కు ఉగాది పురస్కారం
విజయనగరం క్రైమ్: విశిష్టసేవలందించే వారికి రాష్ట్ర ప్రభు త్వం ఏటా ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది ఉమ్మడి విజయనగరం జిల్లా అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేష్ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం అగ్నిమాపక కేంద్రం అధికారిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అంకిత భావం, సేవను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి రమేష్ ఎంపిక కావడంపై ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు.


