పార్వతీపురం: ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను స్టాండింగ్ బోర్డులను సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రారంభించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జిల్లాకు 81 స్టాండింగ్ బోర్డు మంజూరైనట్లు డీపీఆర్‌ఓ కె. బాల్‌మన్‌సింగ్ తెలిపారు. బోర్డులో ఉన్న క్యూ ఆర్ కోడ్‌తో 300లకు పైగా ప్రభుత్వ సేవలను ఇంటివద్దనే పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జేసి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ అధికారులు ఎం. గజపతిరావు, జీవీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: తమ గ్రామానికి పర్యాటక గుర్తింపు తెచ్చినందుకు కృతజ్ఞతగా కుశ గ్రామస్తులు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డికి ‘తొలి పంట’ను కానుకగా అందజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆయనను సోమవారం కలిసి తమ పొలాల్లో పండిన పంటలో మొదటి భాగాన్ని మర్యాదపూర్వకంగా అందజేశారు. గిరి శిఖర గ్రామమైన కుశ సమీపంలోని సహజసిద్ధ జలపాతాలను గుర్తించి, వాటిని వెలుగులోకి తేవడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. ఫలితంగా ఈ గ్రామం రాష్ట్రస్థాయి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ అభివృద్ధికి గుర్తింపుగా సర్పంచ్ కుశమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్‌కు చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అధికారుల సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి:
డా.వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెంలో నిర్వహించిన 12వ అంతర కళాశాల క్రీడా పోటీల్లో డా.వైఎస్సార్ ఉద్యాన కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.డి.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అథ్లెటిక్స్ విభాగంలో షాట్‌పుట్‌లో పృద్వీరాజ్ బంగారు, జావిలిన్‌త్రోలో నాని శ్రీ హర్ష, మౌనిక బంగారు, షార్ట్‌పుట్‌లో మౌనిక రజతం, జావిలిన్ త్రో, హైజంప్‌లో లక్ష్మి రజతాలు, డిస్కస్‌త్రో ట్రిపుల్ జంప్‌లో పూజిత రజతం సాధించినట్లు వివరించారు. అలాగే వాలీబాల్, కోకో, కబడ్డీలో విద్యార్థినులు ప్రతిభను కనబరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం అసోసియేట్ డీన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడీ జి.లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.


