గిరి వెలుగు ప్రాజెక్టు అధికారులు ఒక లక్ష్యం లేకుండా, కేవలం కమీషన్లకు ఆశపడి.. పలు రకాల యంత్రాలను కొనుగోలు చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా వృథాగా పడేశారు. 2022లో కురుపాం, మక్కువ, పార్వతీపురం పరిధిలోని నాలుగు వీడీవీకే కేంద్రాలకు రూ.29.43 లక్షలతో పసుపు, పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను కొనుగోలు చేశారు. మక్కువ మండలంలో 3–ఫేజ్ విద్యుత్తు సౌకర్యం ఉన్నందున అక్కడ యంత్రాలతో పనులు చేస్తున్నారు. మిగిలిన మూడు చోట్ల కరెంటు సమస్య అంటూ అటకెక్కించేశారు. రూ.లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పప్పులు, చిరు ధాన్యాల యూనిట్లు ప్రస్తుతం పార్వతీపురంలోని వైకేఎం కాలనీలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి.


