నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఆలయ అధికారులు శనివారం ఆహ్వానం పలికారు. విజయనగరంలోని ఆయన నివాసంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు, మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా రామతీర్థంలో జరుగుతున్న నవమి ఏర్పాట్లపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈఓకు సూచించారు.
డెంకాడ మండలం మోపాడలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది సాయిరామాచార్యులు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.


