సుమారు రూ.2 కోట్లతో ఉడాయించిన నిర్వాహకుడు లబోదిబోమంటున్న బాధితులు ఇది నకిలీ కేంద్రమని ముందే హెచ్చరించిన ‘సాక్షి’
ఫిర్యాదు చేస్తే చర్యలు
తీసుకుంటాం
పాలకొండ/వీరఘట్టం: పాలకొండ గజాలఖానా సమీపంలో నిర్వహిస్తున్న ఆర్గానిక్ పుట్టగొడుగుల శిక్షణ కేంద్రాన్ని ఉన్నఫళంగా మూసేశారు. కేంద్ర నిర్వాహకుడు, పాలకొండ నగరపంచాయతీకి చెందిన వప్పంగి సంతోష్‌కుమార్ పట్నాయక్ సుమారు రూ.2 కోట్లతో పరారయ్యాడు. ఆయన కొద్దినెలల ముందు గారమ్మతల్లి ఆర్గానిక్ పుట్టగొడుగుల కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇక్కడ పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇస్తామని నిరుద్యోగులను నమ్మించాడు. ఇక్కడ పని చేయాలంటే ప్రతిఒక్కరూ రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు చెల్లించాలనే నిబంధన పెట్టి సుమారు 250 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. డబ్బుచెల్లించిన వారిని శిక్షణ పేరుతో పనిలోకి తీసుకుని వారికి ప్రతినెలా రూ.12 వేలు జీతం ఇచ్చాడు. డిపాజిట్లు ఇచ్చిన వారికి పది నెలలు తర్వాత చెల్లుబాటు అయ్యేలా బ్యాంకు చెక్కులు కూడా అందజేశాడు. నాలుగు నెలలు నిర్వహించిన ఈ కేంద్రాన్ని ఇప్పుడు మూసేసి శిక్షణకోసం చేరిన వారికి కుచ్చుటోపీ పెట్టాడంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. శిక్షణ కేంద్రం తీరుపై గతంలో ‘నిరుద్యోగులూ జాగ్రత్త’ శీర్షిక ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. నిరుద్యోగులను అప్రమత్తం చేసింది. అప్పుడు మేల్కొని ఉంటే మోసపోయేవారం కాదని బాధితులు అంటున్నారు.
పుట్టగొడుడుల కేంద్రం నిర్వహణపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. పుట్టగొడుగుల కేంద్రంలో పనిచేయడానికి డిపాజిట్లు ఎవరైనా ఇచ్చి మోసపోయామనుకుంటే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– ఎం.రాంబాబు, డీఎస్పీ, పాలకొండ


