పార్వతీపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచురించే ఉత్తమ పద్ధతుల మ్యాగ్‌జైన్‌లో పార్వతీపురం మన్యం జిల్లాకు చోటుదక్కింది. జిల్లాలో చేపట్టిన పనులు, వినూత్న ఆవిష్కరణలకు గాను సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్‌లో ఏడీపీ అండ్ ఏబీపీ మిషన్ డైరెక్టర్ రోహిత్‌కుమార్ ఈ పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేశారు. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డికి జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది.
కిడ్నీ బాధితులకు సురక్షిత నీరు
పాలకొండ రూరల్: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొండ ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్‌ను నెఫ్రోప్లస్ ప్రతినిధి రోహిత్‌సింగ్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. డయాసిస్ యూనిట్‌కు కేటాయించిన ఆర్వో యూనిట్ నుంచి నిత్యం దాదాపు 10వేల లీటర్ల నీరు శుద్ధి చేయడంతో పాటు కిడ్నీ బాధితులకు రక్షితనీటిని అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో విడుదలయ్యే వ్యర్థజలాలను భవననిర్మాణ సమయంలో, పంట పొలాలకు వాడుకోవచ్చన్నారు. ఇందులో భాగంగా వ్యర్థజలాలను శ్రీనివాసరావు అనే రైతు పొలానికి మళ్లించారు. సురక్షిత నీటిని వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు, కిడ్నీ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ కడియం చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.
తోటపల్లి పరిసరాల్లో ఏనుగులు
గరుగుబిల్లి: మండలంలోని గిజబ, నందివానివలస తదితర గ్రామాల్లో నాలుగురోజులుగా సంచరిస్తున్న ఏనుగులు సోమవారం తోటపల్లి పరిసరాల్లోకి చేరాయి. ప్రధాన రహదారికి సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో వాహన చోదకులు, ప్రజలు రాకపోకలకు భయాందోళన చెందుతున్నారు. అరటి, వరి పంటలు నాశనం చేయకముందే ఏనుగుల తరలింపునకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
విజయనగరం అర్బన్: విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు డీఈఓ యూ.మాణిక్యంనాయుడు సూచించారు. విజయనగరం కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘స్కూల్ హెల్త్–వెల్‌నెస్’ కార్యక్రమంపై ఒక రోజు ఓరియెంటేషన్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వైద్యశాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సుబ్రహ్మణ్యం పాఠశాల విద్యార్థుల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు, వెల్‌నెస్ అంశాలపై అవగాహన కల్పించారు.
మారు‘మోగిన’ జాతర
రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, రాజాం–బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లిపైడితల్లి మారుజాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. గత నెల 22 నుంచి 24వ తేదీవరకు అమ్మ వారి శతవార్షిక జాతర నిర్వహించిన విషయం విదితమే. ఈ నెల 3న నిర్వహించా ల్సిన మారుజాతర గ్రహణం కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్యక్ర మంలో ఆలయ ధర్మకర్త దుర్గాప్రసాద్, ఈఓ బీవీ మాధవరావు, ఆలయ కమిటీ సభ్యులు సలాది తులసీదాస్ పాల్గొన్నారు.


