సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ, పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పాలక వర్గాల పదవీ కాలం ఈ నెల 17వ తేదీతో ముగుస్తుండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం గ్రేడ్–1 మున్సిపాలిటీకి సంయుక్త కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. సాలూరు గ్రేడ్–2 మున్సిపాలిటీకి పార్వతీపురం ఆర్డీవో వైశాలి, పాలకొండ నగర పంచాయతీకి పాలకొండ డివిజన్ ఆర్డీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. పాలకొండ ఆర్డీవో ఇప్పటికే సీతంపేట ఐటీడీఏ పీవో ఇన్‌చార్జిగానూ వ్యవహరిస్తున్నారు.
‘స్థానికం’ ఇప్పట్లో లేనట్లేనా?
మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఉన్న ప్రస్తుత పాలకవర్గం త్వరలో ముగియనుంది. స్థానిక ఎన్ని కలకు చంద్రబాబు ప్రభుత్వం వెళ్తుందా, లేదా? అన్న సంశయాలకు తెర పడినట్లే. ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారులు కొనసాగుతారని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి మరో ఆరు నెలలైతేనే గానీ.. ఎన్నికల నిర్వహణ, కొత్త పాలకవర్గం కొలువుదీరే అవకాశం లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి పంచాయతీల వారీగా ఓటరు జాబితాను ఈ నెల 9వ తేదీన ప్రకటించాలని ఎన్నికల సంఘం భావించింది. సాంకేతిక సమస్యల కారణంగా పంచాయతీల వారీ జాబితాల రూపొందించడం సాధ్యం కావకపోవడంతో ఈ నెల 18న గడువు ఇచ్చింది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు జూన్ వరకు గడువు ఉంది. ఓటరు జాబితా, రిజర్వేషన్ల కసరత్తు, ఇతర సాంకేతిక అవరోధాలను అధిగమించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆగస్టులోనే స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా, లేక ప్రత్యేకాధికారులతోనే ఇంకొన్నాళ్లు నెట్టుకొస్తుందా? అన్నది చూడాలి. కొత్త పాలక వర్గం బాధ్యతలు స్వీకరించే వరకూ ప్రత్యేకాధికారుల పాలనే సాగనుంది.
పార్వతీపురానికి ప్రత్యేకాధికారిగా జేసీ
సాలూరు, పాలకొండలకు ఆర్డీవోల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈ నెల 17వ తేదీతో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం
‘స్థానిక’ ఎన్నికలకు ప్రభుత్వం వెనుకడుగు


