ఇక్కడ చెమటలు! | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ చెమటలు!

Mar 11 2026 7:36 AM | Updated on Mar 11 2026 7:36 AM

అక్కడ తనిఖీలు..

రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు

టెన్షన్‌లో మున్సిపల్‌ ఉద్యోగులు

సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో.. జిల్లాలోని మున్సిపల్‌ కార్యాలయాల్లో ఉద్యోగులు హడలిపోయారు. తమ కార్యాలయంలో ఎక్కడ తనిఖీలు చేస్తారేమోనని భయంతో వణికిపోయారు. కొంతమంది అప్పటికప్పుడు సెలవు పెట్టేయగా.. మరికొందరు కార్యాలయ పనులంటూ బయట గడిపేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు.. పాలకొండ నగర పంచాయతీగా ఉంది. గత జూన్‌లోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణల నేపథ్యంలో సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌ నడిపేన రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. గతంలోనూ పలువురు కమిషనర్లు ఏసీబీ వలలో చిక్కారు.

ఆ విభాగమే కీలకం..

మున్సిపల్‌ కార్యాలయాల్లో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కీలకం. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్‌ అప్రూవల్స్‌, ప్లాన్‌ మార్పులు వంటి విషయాల్లో అధికారులకు ఎక్కువ నిర్ణయాధికారం ఉంటుంది. దీనిని కొందరు వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో పెద్ద మొత్తంలో డబ్బు, రియల్‌ ఎస్టేట్‌, బిల్డింగ్‌ నిర్మాణాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు ఉంటాయి. అనుమతులు త్వరగా రావడానికి లేదా నిబంధనలు సడలించడానికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉంది. పార్వతీపురం, సాలూరు వంటి ప్రాంతాల్లో ప్లాన్‌ అప్రూవల్‌ లేని భవనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇల్లు కట్టాలన్నా, మాల్‌ కట్టాలన్నా అధికారులకు, నాయకులకు తాంబూలం చెల్లించాలి. పార్వతీపురం మున్సిపాలిటీలో ప్లాన్‌ లేకుండానే హోటళ్లు, భవనాలకు అనుమతులిచ్చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలోని పలు పెద్ద హోటళ్లలో చాలావాటికి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా నగర పాలక సంస్థల్లో ఏసీబీ దాడులు జరగడంతో ఇక్కడ ఉద్యోగులకు చెమటలు పట్టాయి. చివరికి కార్పొరేషన్లలోనే తనిఖీలు చేస్తున్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement