స్థానిక పోరునా! | - | Sakshi
Sakshi News home page

స్థానిక పోరునా!

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

స్థానిక పోరునా!

స్థానిక పోరునా!

స్థానిక పోరునా! జన గణనా.. స్థానిక పోరుపైనా చర్చ!

నేడు, రేపు కలెక్టర్ల సమావేశం

జనగణన సన్నద్ధతపై రాష్ట్ర స్థాయి సదస్సు

రెవెన్యూ అంశాలపైనా కార్యశాల

సాక్షి, పార్వతీపురం మన్యం: ఓ వైపు జనగణన, కుల గణనకు కేంద్రం సిద్ధం అవుతున్న విషయం విదితమే. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాలకూ ఓటర్ల జాబితాపై స్పష్టమైన సూచనలు కూడా జారీ చేసింది. జనగణన మొదలైతే.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యపడుతుందా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం రెండు కీలక కార్యక్రమాలపైనా కసరత్తు చేస్తోంది. పై నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్లతో రాష్ట్ర స్థాయిలో సదస్సు జరగనుంది. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభాకర రెడ్డి కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ నెల 20న భారత జనగణన–2027 నిర్వహణకు సంబంధించి సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. జనగణన నిర్వహణకు అవసరమైన అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్ల ఖరారు, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల అవసరాలను అంచనా వేయడం, మాస్టర్‌ ట్రైనర్ల జాబితాను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు (ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్లు), మున్సిపల్‌ కమిషనర్లు హాజరవుతున్నారు. ఈ నెల 23 నుంచి జిల్లా స్థాయి అధికారులకు ప్రారంభం కానున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండో రోజు ఈ నెల 21న రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించనున్నారు. పునఃసర్వే, సెక్షన్‌ 22ఏ కింద నిషేధించిన ఆస్తులను జోడించడం, తొలగించడం, సవరించడం కోసం అధికారాల అప్పగింత, వెబ్‌ ల్యాండ్‌, పాత భూమి రికార్డుల డిజిటలైనేషన్‌ తదితర అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు స్థానిక సంస్థల పదవీకాలం ముగుస్తోంది. ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో జిల్లా అధికారులు కసరత్తును ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు శాసనసభ నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. జిల్లాలోని 451 పంచాయతీల వారీగా ఓటరు జాబితాను వేరు చేసే ప్రక్రియలో మండల అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చి 9న పంచాయతీల్లో ఓటరు జాబితాను ప్రకటించాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనగణన ముందు ఉంటుందా.. స్థానిక పోరుకు సిద్ధం అవుతారా? అనే విషయాలపై ఈ సమావేశం అనంతరం స్పష్టత వచ్చే వీలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement