మండల పరిషత్‌లో పీఆర్ పనుల లొల్లి
జియ్యమ్మవలస రూరల్: అధికారబలం ఉంది... పనులన్నీ మావే అన్న రీతిన కూటమి నేతల తీరు ఉంది. మండలానికి మంజూరైన రూ.10.6కోట్ల విలువైన 172 పనులను టెండర్లు లేకుండా, మండల పరిషత్‌లో తీర్మానం చేయకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పంపకాలు జరిపారు. రోడ్లు, సీసీ కాలువల నిర్మాణంలో జాప్యం చేస్తున్నారు. టెండర్లు వేసి మార్చి 15 లోగా పనులు పూర్తి చేయాలన్న కలెక్టర్ ఆదేశాలకు భిన్నంగా పనులు సర్దుబాటు చేయడం మండలంలో పెద్ద దుమారం రేగుతోంది. పనుల తీరుపై ఎన్‌ఆర్‌ఈజీఎస్ పీడీ కె.రామచంద్రరావు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ధర్మారావు ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంతవరకు సీసీ రోడ్లు, కాలువల పనులు ప్రారంభించకపోవడంపై ఎంపీడీఓ కె.ధర్మారావును ప్రశ్నించారు. తనకు ఈ రోజే వర్కులిస్టును పీఆర్‌ఈఈ పార్థసాయి ఇచ్చారని, పనులు మంజూరైనట్టు తమవద్ద ఎలాంటి సమాచారం లేదనడం గమనార్హం. రూ.10 కోట్ల విలువైన పనులను టెండర్ లేకుండా ఎలా కేటాయిస్తారని విలేకరులు ప్రశ్నించగా... జిల్లా అంతటా ఎలా పనులు జరుగుతాయో ఇక్కడ కూడా అదేరీతిన సాగుతాయంటూ పీడీ సమాధానం దాటవేశారు.
ఇదే అంశంపై ఎంపీపీ బొంగు సురేష్ పీడీతో మాట్లాడుతూ మండలంలోని 31 పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు పూర్తి కావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం టెండర్లకు పిలిచి అనంతరం పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. దీనిపై పీడీ స్పందిస్తూ టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని ఎంపీడీఓకు సూచించారు. అయితే, ఇప్పటికే పనులు పంచుకుని ప్రారంభించేందుకు సిద్ధమైన కూటమి నేతలు పీడీ ఆదేశాలలో కుమ్ములాడుకుంటున్నారు. టెండర్లతో సంబంధం లేకుండా పనులు చేస్తామని, ఎందుకు బిల్లులు చెల్లించరో చూస్తామంటూ కొందరు బహిరంగంగానే అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


