సకాలంలో అందని రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

సకాలంలో అందని రేషన్‌

Nov 27 2025 7:45 AM | Updated on Nov 27 2025 7:45 AM

సకాలంలో అందని రేషన్‌

సకాలంలో అందని రేషన్‌

సకాలంలో అందని రేషన్‌

బస్తాల వేయింగ్‌లో తేడాలు

తహసీల్దార్‌ దృష్టిలో పెట్టిన రేషన్‌ డీలర్లు

డిసెంబర్‌ నెలకై నా సకాలంలో అందేనా అని లబ్ధిదారుల ఆందోళన

రామభద్రపురం: మండలంలో సకాలంలో రేషన్‌ సరుకులు డిపోలకు చేరడం లేదని, లబ్ధిదారులకు తాము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని మండల పరిధిలోని రేషన్‌ డీలర్లు తహసీల్దార్‌ అజు రఫీజాన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రేషన్‌ డిపోల డీలర్లతో తహసీల్దార్‌ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ నెలకు సంబంధించి ఈ నెల 26 నాటికి రేషన్‌ బియ్యం డిపోలకు చేరాల్సి ఉందని ఇప్పటికీ రాలేదని తహసీల్దార్‌తో చెప్పారు. అలాగే వృద్ధులు, మంచం పట్టిన వారికి రేషన్‌ సరుకులు ఇవ్వాల్సి ఉందని తమవద్ద ఓబీ సరుకులు లేకపోవడంతో లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నామని పలువురు డీలర్లు చెప్పారు. సకాలంలో రేషన్‌ ఇవ్వకపోవడం వల్ల లబ్ధిదారులు దుర్భాషలాడుతున్న పరిస్థితి ఉందని వాపోయారు. గోదాం నుంచి వచ్చిన రేషన్‌ బియ్యం బస్తాల వేయింగ్‌లో తేడాలు ఉంటున్నాయి. ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. కమీషన్‌ కూడా సకాలంలో రావడం లేదని తహసీల్దార్‌ దృష్టిలో పెట్టారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ డీఎంతో మాట్లాడి రేషన్‌ సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకుంటానని, డిపోలకు సకాలంలో చేరేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఇక నుంచి బియ్యం బస్తాల వేయింగ్‌లో వ్యత్యాసాలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏది ఏమైనా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాతో పాటు డీలర్లు, సివిల్స్‌ సప్‌లైస్‌ అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

లబ్ధిదారుల్లో ఆందోళన

నవంబరు నెలలో పేద లబ్ధిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. నవంబరు నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యం బొబ్బిలి గోదాం నుంచి గత నెల 26వ తేదీ లోపు డిపోలకు సరఫరా అవాల్సి ఉంది. అలాగే అదే నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ లోపు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు కదలలేక మంచం పట్టిన వారికి డీలర్లు పంపిణీ చేయాల్సి ఉన్నా అలా జరగలేదు. తుఫాన్‌ ప్రభావంతో పారాది వేగావతి నదిపై నిర్మించిన కాజ్‌వే కొట్టుకుపోవడం వల్ల లోడులతో లారీలు రాకపోకలు సాగక తెర్లాం మీదుగా రామభద్రపురం మండల రేషన్‌ డిపోలకు బియ్యం సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులకు ఇబ్బంది కలిగింది. దీంతో ఈ నెల 10వ తేదీ వరకు పూర్తిస్థాయిలో బియ్యం రేషన్‌ డిపోలకు చేరక లబ్ధిదారులకు డీలర్లు పంపిణీ చేయలేకపోయారు. దీంతో లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడి బయట కొనుగోలు చేసి వండుకు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్‌ నెలకై నా సంబంధిత అధికారులు సకాలంలో రేషన్‌ బియ్యం సరఫరా చేస్తారో లేదనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 33 రేషన్‌ డిపోల పరిధిలో 15083 కార్డు దారులు ఉన్నారు. వారికి 236 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు సకాలంలో బియ్యం డిపోలకు చేరకపోవడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.వచ్చే నైలెనా సకాలంలో సరఫరా అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డిసెంబర్‌ నెలకు సంబంధించి రేషన్‌ బియ్యం సకాలంలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్‌డీటీ సాయికృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement