పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య
గజపతినగరం: మండలంలోని ఎం.గుమడాం గ్రామానికి చెందిన గంట్యాడ అప్పలనాయుడు(54) మానసిక స్థితి బాగాలేక గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత రెండు సంవత్సరాలుగా అప్పలనాయుడు మానసిక స్థితి బాగాలేక పోవడంతో అతడి భార్య సత్యవతి విశాఖ మెంటల్ (కేర్) ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తూ వచ్చేదని అన్నారు. అయితే గురువారం తన స్వగ్రామంలో అప్పలనాయుడు తన ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో తన ఇంటి మేడమీదకు వెళ్లి పురుగుల మందు తాగినట్టు చెప్పారు. వెంటనే తన భార్య సత్యవతి కుటుంబ సభ్యులు గుర్తించి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ అప్పలనాయుడు మృతి చెందాడు. అప్పలనాయుడుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు బాష పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రెండవ కుమారుడు మురళి వ్యవసాయం చేస్తున్నాడు. మృతుడు భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్‌కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


