కాలువ నిర్మాణంలో ఉద్రిక్తత
భోగాపురం: మండలంలోని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ్‌నగర్ కాలనీ సమీపంలో కాలువను నిర్మించేందుకు ముంజేరు గ్రామస్తులు గురువారం చేపట్టిన నిర్మాణ పనులను కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో కాలనీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలోని మహిళలు, కాలనీలోని మహిళల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఒకరిని ఒకరు తోసుకుంటూ కుమ్ములాటకు దిగారు. పరిస్థితి ఉధృతంగా మారుతుందని గ్రహించిన ఎస్‌ఐ సూర్యకుమారి మహిళ పోలీసు సిబ్బందితో కలిసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఇరువర్గాల చెందిన మహిళలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఇంతలో విషయం తెలుసుకున్న డీఎస్పీ ఆర్.గోవిందరావు నిర్మాణం చేపడుతున్న కాలువ వద్దకు చేరుకుని జరిగిన పరిస్థితిపై ఆరా తీశారు. కాలువ నిర్మాణంపై గ్రామ సభ నిర్వహించగా గ్రామంలోని ఎక్కువ శాతం మంది ప్రజలు కాలువ నిర్మాణం వైపే మొగ్గు చూపడంతో తీర్మానం చేసి వర్క్ ప్రపోజల్ సెంక్షన్ చేసి కాంట్రాక్ట్ పనులను గ్రామంలోని బంకపల్లి నూకమ్మ అనే డ్వాక్రా మహిళకు ఇవ్వడంతో ఆమె నిర్మాణ పనులు చేపట్టిందని డిప్యూటీ ఎంపీడీవో గాయత్రి డీఎస్పీ గోవిందరావుకు వివరించారు. దీనిపై డీఎస్పీ స్పందిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామస్తులందరి సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్ కాలువ నిర్మాణ పనులను కొనసాగించారు.


