26న కలెక్టరేట్ వద్ద రైతు గర్జన
పార్వతీపురం రూరల్: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున రైతన్న చేసిన చారిత్రక పోరాటానికి ఐదేళ్లు నిండిన వేళ.. హక్కుల సాధన కోసం మరో మారు పిడికిలి బిగించేందుకు కర్షక లోకం సిద్ధమయ్యింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 26న పార్వతీపురంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని మోర్చా జిల్లా కన్వీనర్ బంటు దాసు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో పి.శ్రీనునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. గతంలో రైతుల ఆందోళనకు తలొగ్గి రద్దు చేసిన వ్యవసాయ నల్ల చట్టాలను, కేంద్రం దొడ్డి దారిన మళ్లీ అమలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, పారిశ్రామిక అవసరాల పేరుతో సాగు భూములను లాక్కోవడానికి తీవ్రంగా ఖండించారు. కార్మికుల కష్టాన్ని దోచుకునేలా పెంచిన పనిగంటలు, లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవక రైతుల్లో కళ్లాల్లోనే కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రాలు ప్రారంభించి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపితే సహించేది లేదని హెచ్చరించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, రైతు కూలీ సంఘం, గిరిజన సంఘాల నాయకులు ఆర్‌వీఎస్ కుమార్, గిరిజన సంఘం నాయకులు పాలక రంజిత్‌కుమార్ డి.రమణారావు, ఎం.భాస్కరరావు, పి.సంఘం, టి.జీవ తదితరులు పాల్గొన్నారు.


