ఏనుగులు ధ్వంసం చేసిన పంట పరిహారం కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఏనుగులు ధ్వంసం చేసిన పంట పరిహారం కోసం ఆందోళన

Oct 2 2025 8:03 AM | Updated on Oct 2 2025 8:05 AM

ఏనుగులు ధ్వంసం చేసిన పంట పరిహారం కోసం ఆందోళన

పార్వతీపురం రూరల్‌: ఏనుగుల గుంపు సృష్టిస్తున్న బీభత్సానికి తమ పంటలు సర్వనాశనమయ్యాయని, తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు కలెక్టరేట్‌ వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, గిరిజన సంక్షేమ సంఘం నేతృత్వంలో బుధవారం నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని మరికి, కృష్ణపల్లి తదితర గ్రామాల సమీపంలో 8 రోజులుగా ఏనుగులు సంచరిస్తూ సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న, వరి, టేకు చెట్లను ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం నష్టాన్ని అంచనా వేయడానికి కూడా రాలేదని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ జిల్లా సభ్యుడు పి. సంగం, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని, అరకొర సాయం అందించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారని, పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి న్యాయమైన పరిహారం చెల్లించాలని, అలాగే ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రైతులు, ప్రజల ప్రాణాలకు, పంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్న గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

పంట నష్టపరిహారాన్ని త్వరగా అందించేలా చర్యలు

ఏనుగులు ధ్వంసం చేసిన పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని సత్వరమే అందజేయాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి డీఎఫ్‌ఓ జీఏపీ ప్రసూనను ఆదేశించారు. పార్వతీపురం మండలం మరికి, కృష్ణపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఏనుగుల గుంపు తమ పంట పొలాల్లోకి చొరబడి తాము సాగుచేసుకుంటున్న పంటలను ధ్వంసం చేస్తున్నాయని బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కావున నష్టపోయిన పంటలకు గాను సంబంధిత రైతులు, కౌలు రైతులకు తగిన నష్టపరిహారాన్ని అందించి తమను ఆదుకోవాలని కలెక్టరుకు దరఖాస్తు అందజేశారు. ఈ దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్‌ వెంటనే స్పందించి, జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందజేయాలని, అలాగే నష్టపోయిన గిరిజన రైతులకు త్వరగా నష్టపరిహారం అందించే దిశగా సత్వర చర్యలు చేపట్టాలని డీఎఫ్‌ఓ జీఏపీ పి.ప్రసూనను ఆదేశించారు. దీంతో రైతులు తమ ఆనందం వ్యక్తం చేశారు.

ఏనుగులు ధ్వంసం చేసిన పంట పరిహారం కోసం ఆందోళన1
1/1

ఏనుగులు ధ్వంసం చేసిన పంట పరిహారం కోసం ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement