
పైడితల్లి అమ్మవారి ప్రసాదాల నాణ్యత పరిశీలన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు వినియోగిస్తున్న ప్రసాదాల నాణ్యత తీరును ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లు బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుడ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వరి మాట్లాడుతూ అమ్మవారి పండగకు సంబంధించి తయారుచేసే లడ్డు, పులిహోర ప్రసాదాలకు సంబంధించిన ఆహారపదార్థాల నాణ్యతను ప్రతిరోజూ చెక్ చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించామని, వాటిని హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఫుడ్ లేబొరేటరీకి పంపిస్తామన్నారు. ప్రసాదాలకు వినియోగించే కందిపప్పు, శనగపప్పు, కాజూ, నెయ్యి తదితర వాటిని చెక్ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ నాగుల్ మీరా, ఆలయ సూపర్‌వైజర్ రమేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.