
అర్చకుల ఆర్తనాదం..!
వంగర: మండల పరిధిలోని సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి దేవాలయం పరిధిలో దేవదాయ శాఖ భూమిపై టీడీపీ నేత కన్ను పడింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంకెవ్వరు అడ్డు అంటూ గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు సుమారు 80 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నాడు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన బోర్డును సైతం లెక్క చేయకుండా భూమిని ఆక్రమించేశాడు. కొన్ని దశాబ్దాలుగా సంగమేశ్వరస్వామి దేవాలయం పురోహితులు(అర్చకులు)గా ఉంటున్న సిద్ధాంతం చిన్నిస్వామి, సిద్ధాంతం పోలిలింగం, సిద్ధాంతం విశ్వనాథం, సిద్ధాంతం నాగభూషణరావులు ఆ భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఈ భూమిని గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు ఆక్రమించుకోవడంతో దేవాదాయ శాఖ ఈవో పొన్నాడ శ్యామలరావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సిద్ధాంతం గణపతిరావు ఆధ్వర్యంలో అర్చకుల బృందం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ భూమి వదిలేందుకు ఆక్రమణదారు ముందుకు రాకపోవడంతో బుధవారం గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమై నిరసన తెలిపారు. ఆక్రమించుకున్న భూమి వద్దకు వెళ్లి కొన్ని దశాబ్దాల నుంచి సంగమేశ్వరస్వామి ఆలయ పురోహితులు అనుభవించే వారని, ఇప్పుడు ఈ భూమి ఎలా దఖలుపడిందని ఆక్రమణదారును ప్రశ్నించారు. అనంతరం గ్రామంలో తిరుగాడుతూ దేవాదాయ శాఖ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు.
న్యాయం చేయాలంటూ వేడుకోలు
దేవదాయ శాఖ భూమిని ఆక్రమించిన టీడీపీ నేత
పార్టీలకు అతీతంగా గ్రామంలో నిరసన
పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖలకు ఫిర్యాదు

అర్చకుల ఆర్తనాదం..!