అర్హులను పెంఛన్‌! | - | Sakshi
Sakshi News home page

అర్హులను పెంఛన్‌!

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

కొత్త దరఖాస్తులకు అవకాశమే లేదు..

చంద్రబాబు ప్రభుత్వంలో రెండేళ్లుగా

మంజూరు కాని కొత్త పింఛన్లు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న అర్హులు

కార్యాలయాల చుట్టూ

తిరిగినా ఫలితం శూన్యం

కొత్త దరఖాస్తులకు

అందుబాటులో రాని విధానం

పైగా జిల్లాలోని లబ్ధిదారుల్లో

14,238 మందికి రద్దు

సత్తెనపల్లి: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం పలువురు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 2019–24 మధ్య వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల నమోదు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేదని పలువురు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ విధానం నిలిచిపోయిందని విమర్శిస్తున్నారు.

రాజకీయ పైరవీలకే ప్రాధాన్యం

గత ప్రభుత్వంలో పింఛన్‌ దరఖాస్తుదారుడు అర్హుడా, కాదా.. అనే విషయాన్ని స్థానిక సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయించేవారని చెబుతున్నారు. అనంతరం ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల సమాచారంతో సరిపోల్చి పలు దశల్లో పరిశీలన అనంతరం పింఛన్‌ మంజూరు చేసేవారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్‌ ప్రక్రియలో ఉద్యోగులే అర్హతను నిర్ణయిస్తున్నారని, ఈ ప్రక్రియపై అధికార కూటమి నాయకుల ప్రభావం, ఒత్తిడి ఉంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన కొందరిని కూడా అనర్హులుగా గుర్తిస్తున్నారని సమాచారం.

నిరంతరాయంగా తొలగింపులు..

కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, ఇప్పటికే ఉన్న వాటిని మాత్రం ప్రతి నెల తొలగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 2024 జూన్‌ 1 నాటికి జిల్లాలో 2,80,568 పింఛన్లు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 2,66,330కు తగ్గింది. అంటే రెండేళ్లలో 14,238 పింఛన్లు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. విద్యుత్‌ వినియోగం, ఆదాయపు పన్ను, నాలుగు చక్రాల వాహనం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి తదితర కారణాల పేరుతో వేలాది పింఛన్లు తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. వలంటీర్ల వ్యవస్థ కొనసాగి ఉంటే సచివాలయ ఉద్యోగులతో సమన్వయం చేసి కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ సజావుగా సాగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని అర్హులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ సేవలు కూడా నిలిచిపోయినట్లు పేర్కొంటున్నారు. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏడాది పొడవునా దరఖాస్తులు స్వీకరించేవారని, ప్రస్తుతం జిల్లాలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ఆ సేవలు అందుబాటులో లేవని అంటున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), అలాగే ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజా వినతుల కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పింఛన్‌ దరఖాస్తులు అందజేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

అర్హులైన పలువురు కొత్త పింఛన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లకు పైగా కొత్త పింఛన్లు లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశ చెందుతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారు, ప్రమాదాల్లో దివ్యాంగులై వారు, వృద్ధాప్యంతో ఉపాధి కోల్పోయిన వారు పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో వారికి తీవ్ర అవస్థలు తప్పడం లేదు. కొత్తవారికి ఇవ్వకపోగా ఉన్నవారి పింఛను రద్దు చేస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement