ఈశ్వర్ చిట్‌ఫండ్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన
నరసరావుపేట టౌన్: చిట్‌ఫండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవటంతో పాటు తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించాలని బాధితులు శనివారం నరసరావుపేటలోని అరండల్‌పేటలోని ఈశ్వర్ చిట్‌ఫండ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఈశ్వర్ చిట్‌ఫండ్‌లో సభ్యులుగా చేరి ప్రతినెలా క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించామన్నారు. చిట్టీ పాట పాడిన వారికి నేటికి డబ్బులు చెల్లించలేదన్నారు. అదే విధంగా చిట్టీపాట గడువు పూర్తి అయినప్పటికీ సభ్యులకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వటంలేదన్నారు. 2019లో ప్రారంభమైన రూ.25 లక్షల చిట్టీపాట 2024లో ముగిసిందన్నారు. ఆ చిట్టీపాటలో తాము సభ్యులుగా చేరి ప్రతినెలా రూ.50 వేలు సంస్థకు చెల్లించామన్నారు. గత రెండేళ్లుగా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారన్నారు. చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్తాజ్ ఆలీ విదేశాలకు వెళ్లాడని వంక చూపి అతని తండ్రి షౌకత్ ఆలీ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే చిట్‌ఫండ్ మోసంపై పల్నాడు జిల్లా ఎస్పీతో పాటు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులతో చర్చించారు. జరిగిన సంఘటనపై ఫిర్యాదు ఇస్తే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.


