సామాన్యుడిపై ధరవు | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై ధరవు

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

సామాన్యుడిపై ధరవు

క్వింటాకు రూ.800 పెరిగిన బియ్యం ధరలు నిత్యావసర వస్తువుల ధరలకు అమాంతం రెక్కలు జీఎస్టీ తగ్గింపు క్షేత్రస్థాయిలో అమలు కాని పరిస్థితి సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలు కనీసం పట్టించుకోని అధికారులు

జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడుతోంది. బియ్యంతో పాటు వంటనూనెలు, పప్పుధాన్యాలు, వేరుశనగ గుళ్లు, పంచదార తదితర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో రెండు పూటలా కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి కూడా కష్టంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు సైతం భారీగా పెరగడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

సత్తెనపల్లి: ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్న బియ్యం నుంచి దొడ్డ బియ్యం వరకు నెల రోజుల్లోనే 20 నుంచి 40 శాతం వరకు ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో పప్పుధాన్యాలు, అపరాలు, పంచదార వంటి వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. ఈ వారం మార్కెట్‌ ధరలను పరిశీలిస్తే చాలా వస్తువులపై కిలోకు రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగినట్లు కనిపిస్తోంది. వంటనూనెల ధరలు కూడా మరింత భారంగా మారాయని ప్రజలు చెబుతున్నారు.

ఇష్టానుసారంగా విక్రయాలు

జిల్లాలోని అనేక కిరాణా దుకాణాల్లో వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వస్తువు ఒక దుకాణంలో ఒక ధరకు, మరో దుకాణంలో మరో ధరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ.1,350 ఉన్న 25 కిలోల సన్న బియ్యం బస్తా ప్రస్తుతం రూ.1,550కు చేరింది. కర్నూలు రకం బియ్యం గత నెలలో రూ.1,050 ఉండగా ప్రస్తుతం రూ.1,500కు విక్రయిస్తున్నారు. అంటే క్వింటాకు దాదాపు రూ.800 వరకు ధర పెరిగినట్లు తెలుస్తోంది. హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నప్పటికీ పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జీఎస్టీ తగ్గినా పాత ధరలే

నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ తగ్గింపు అమలు కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ స్లాబులు మార్కెట్లో అమలు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా దుకాణాల్లో ఇప్పటికీ పాత ధరలకే విక్రయాలు కొనసాగుతున్నాయి. సరుకుల ధరలు, సబ్బులు, ఇతర వస్తువులపై జీఎస్టీ తగ్గింపును అమలు చేయాలని వినియోగదారులు ప్రశ్నిస్తే, వంటనూనెలకు జీఎస్టీ తగ్గలేదంటూ కొందరు వ్యాపారులు సమాధానం చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఒక ధర, క్షేత్రస్థాయిలో మరో ధర ఉండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు.

ప్రతి దుకాణంలో నిత్యావసర వస్తువుల ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులు ఆదేశించినప్పటికీ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ధరల పట్టికలు లేకుండానే వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. ధరలపై ప్రశ్నించిన వినియోగదారులకు ‘ఇంకా కొత్త ధరలు అమల్లోకి రాలేదు‘ అంటూ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. మరోవైపు, చౌకధరల దుకాణాల్లో రాయితీపై అందించే కందిపప్పు సరఫరాను 2025 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం నిలిపివేయడంతో ప్రజలు బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు లేక కూలీలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు, వేతనాలు పెరగని స్కీం వర్కర్లు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement