అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం బాలచా ముండేశ్వరి దేవిని శాకంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని అన్నిరకాల కూరగాయలతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. లోక కల్యాణార్థం పాడి పంటలతో రైతులంతా సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రకృతిలో దొరికె అన్నిరకాల కూరగాయలతో అలంకరించామని ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ తెలిపారు. అలాగే ఆలయంలోని జ్వాలాముఖి దేవి అమ్మ వారిని కూడా శాకబరీదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల చాముండేశ్వరి దేవి అమ్మ వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల కాలనీ రాజునగర్లోని మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, గోరింటాకు ప్యాకెట్లు, స్వీట్లు, పండ్లు తదితరాలు సమర్పించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ చక్రానికి కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు రంగావజ్జుల కోటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి.
అమరావతి: అమరావతి గ్రామ దేవత పెద్దింటమ్మకు ఆషాఢ పౌర్ణమి సారె సమర్పించే కార్యక్రమాన్ని బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. అనంతరం గ్రామంలోని మహిళా భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు మేళాతాళాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ రూరల్ పరిధిలోని పలు దేవాయాలలో బుధవారం గురుపూర్ణిమ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురుపూర్ణిమ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామి వారికి అభిషేకం, 10 గంటలకు విద్యామూర్తి శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం, 10.30 గంటలకు అస్మత్ ఆచార్య ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
● తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం చెట్టుకింద ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని ఆయనకు ప్రీతిపాత్రమైన 5 వేల గారెలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


