వసూళ్ల రోగం.. ఫిర్యాదుల పర్వం | - | Sakshi
Sakshi News home page

వసూళ్ల రోగం.. ఫిర్యాదుల పర్వం

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

వసూళ్ల రోగం.. ఫిర్యాదుల పర్వం

జీజీహెచ్‌లో ఉద్యోగుల మధ్య తీవ్ర విభేదాలు వర్గాలుగా విడిపోయి పరస్పర ఫిర్యాదులు అవినీతి వాటాల పంపకాల్లో తేడాలే కారణమని ఆరోపణలు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ పరిపాలన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఆస్పత్రి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కొంతమంది ఉద్యోగులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తున్నా, సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లినా, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఆస్పత్రి ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ ఆస్పత్రి పరువును బజారున పడేస్తున్నారు.

మామూళ్ల మత్తులో...

కార్యాలయ ఉద్యోగుల్లో కొంతమంది మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారు. సదరు ఉద్యోగులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో కేవలం సీట్ల మార్పులతోనే సరిపెట్టేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై ఆస్పత్రి అధికారులు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో వారి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ పేరుతో కమిటీలు వేసి కాలయాపన చేయడమే తప్ప, కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు

అవినీతికి పాల్పడుతున్న కొంతమందిపై ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ఆస్పత్రి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొంతమంది కార్యాలయంలోనే కూర్చొబెట్టి పంచాయితీలు పెడుతున్నారు. ఉద్యోగులు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని ఫైళ్లు క్లియర్‌ చేశారు, ఏవి ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి, వాటికి కారణాలేమిటి, త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశాలు ఇవ్వడం వంటి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు తనిఖీలు కూడా చేయడం లేదు. తమ గదుల్లోనే కూర్చుండిపోవడంతో పరిపాలన కార్యాలయంలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. పాలన కుంటుపడుతోంది. అవినీతి వాటాల పంపకాల్లో తేడాల రావడం వల్లే సోషల్‌ మీడియా వేదికగా ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి క్రమశిక్షణ పెంచి, సకాలంలో ఫైళ్లు క్లియర్‌ అయ్యేలా చూడటంతోపాటు అవినీతిని నిర్మూలించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement