నరసరావుపేట: జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. గ్రానైట్ అక్రమ రవాణా, మైనింగ్ నివారణ దిశగా వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... జీఎస్టీ చెల్లించకుండా రవాణా చట్టరీత్యా నేరమని అన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతోపాటు ఆయా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు, గనుల శాఖ అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా, జీఎస్టీ అధికారులు కమిటీగా ఏర్పడి రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్‌పోస్ట్‌ల వద్ద విస్తృత తనిఖీ చేయాలని, మూడు షిఫ్టుల్లో పని చేయాలని అన్నారు. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అందులో దాచేపల్లి 4, కారంపూడి, నకరికల్లు, మాచెర్ల, మాచవరంలలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని చెప్పారు. వారిపై తీసుకున్న చర్యలను గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ సంతోష్, డీఆర్‌ఓ అద్దయ్య, అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్షలో కలెక్టర్


