ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి లారీ ఢీకొని గేదె మృతి టీటీడీ దర్శన టికెట్లు ఇప్పిస్తానని మోసం విద్యుత్‌ షాక్‌తో కార్మికుడు మృతి సింగరుట్ల ఆలయ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు విడుదల వాహన చోదకుడి నిర్లక్ష్యానికి మహిళ బలి

నరసరావుపేట టౌన్‌: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ జీరో జెడ్‌ 0456 నంబరు గల బస్సు విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో వినుకొండ మీదుగా నరసరావుపేటకు చేరింది. అందులో బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం గ్రామానికి చెందిన బోయిన ఆదాము (55) ప్రయాణిస్తూ మృతి చెందాడు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల గమనించి విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికు తెలియజేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చిలకలూరిపేటలో అనారోగ్యంతో ఉన్న తన భార్య మరియమ్మను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఆరోగ్య పరిస్థితిపై బంధువులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫిరోజ్‌ తెలిపారు.

రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామ సమీపంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ చూడిగేదెను బుధవారం రాత్రి లారీ ఢీకొట్టడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే లారీని నిలుపుదలచేసి పోలీసులు సమాచారం అందించారు. మిన్నీ జాతికి చెందిన ఈ గేదె విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

గురజాల: గురజాల పట్టణానికి చెందిన వంకాయల అక్షయ్‌ కుమార్‌ టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి కొంతమంది వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని టికెట్లు ఇప్పించకుండా పలుమార్లు తప్పుడు హామీలు ఇస్తూ తప్పించుకొని తిరుగుతూ మోసానికి పాల్పడినట్లు సీఐ ఎం.మురళీ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు గురజాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదులోని ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు గురజాల పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ టీటీడీ దర్శన టికెట్లు, ప్రభుత్వ సేవలు లేక ఇతర సౌకర్యాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి నగదు చెల్లించవద్దని, ముందుగా వారి విశ్వసనీయతను నిర్ధారించుకోవాలన్నారు. వారు చెప్పే మోసపూరిత మాటలకు లొంగి నగదును ఇవ్వాల్సిన సంఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

పిడుగురాళ్ల: భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం 24 పరగణాల జిల్లా షుతి గ్రామానికి చెందిన మనోజ్‌ బిశ్వాస్‌ (38) గత కొంత కాలంగా పట్టణంలోని రజక కాలనీకి సమీపంలోని ఎస్సీ స్మశాన స్థలంలో నిర్మిస్తున్న మురుగునీటిని శుద్ధి చేసే ప్రాజెక్టులో పనిచేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అక్కడ ట్యాంక్‌లో వర్షపునీరు నిల్వ ఉండటం, ఆ వర్షపు నీటిని మోటర్‌ ద్వారా బయటికి పంపించే క్రమంలో మోటార్‌ వైర్‌ జాయింట్‌ ఉండటంతో ఆ జాయింట్‌ మనోజ్‌ బిశ్వాస్‌కు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పట్టణ సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకున్నారు. మృతుడి స్నేహితుడు, తోటి కార్మికుడైన సుశాంత్‌ బిశ్వాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎస్‌.వెంకట్రావు పేర్కొన్నారు.

కారెంపూడి: చారిత్రక ప్రసిద్ధి చెందిన మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సింగరుట్ల క్షేత్రంలో కొలువై ఉన్న స్వయంభు శ్రీనారసింహాస్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ.2 కోట్లు సీజీఎఫ్‌ నిధులు విడుదలైనట్లు దేవదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారని దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త గుండాల శ్రీనివాసరావు బుధవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. మ్యాచింగ్‌ గ్రాంటు కింద రూ. 20 లక్షలు జమ చేయాల్సి ఉందన్నారు. మ్యాచింగ్‌ గ్రాంటు మొత్తం జమ కాగానే సీజీఎఫ్‌ నిధులు దేవాలయ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. నెల రోజుల గడువు లోగా మ్యాచింగ్‌ గ్రాంటు జమ చేయాల్సి ఉందన్నారు.

గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ వాహన చోదకుడి నిర్లక్ష్యానికి ఓ మహిళ మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దాసరి సత్యనాగ కుమారి (63) గృహిణి. వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం విజయవాడ నగరానికి చేరుకుంది. బందరురోడ్డు పీవీపీ మాల్‌ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వైపు వేగంగా వెళుతున్న మట్టా భాను ప్రకాష్‌ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన సత్యనాగ కుమారి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తాడేపల్లి మున్సిపల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ వృద్ధురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన చోదకుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనాగకుమారి మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement