రైతులు పంటల బీమా నమోదు చేసుకోవాలి నరసరావుపేట: పంటల బీమాలో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. వ్యవసాయ, ఉద్యాన పంటల శాఖ అధికారులతో బుధవారం కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పండు మిరప, పత్తి పంటలకు జూలై 31వ తేదీలోగా, వరి పంటకు ఆగస్టు 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలన్నారు. పత్తి పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 31 తేదీ వరకు గడువు పెంచారని కలెక్టర్ చెప్పారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున పత్తి రైతులు విధిగా బీమా చేసుకోవాలని సూచించారు. వరి, పండు మిరప, కంది పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం (పీఎంఎఫ్‌బీవై) కింద, పత్తి పంట పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద వర్తింపజేయడం జరుగుతుందన్నారు. 2026–27కు పంటల బీమా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. పీఎంఎఫ్‌బీవైకు జెనరలీ సెంట్రల్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీని, ఆర్‌డబ్ల్యూబీసీవైఎస్ అమలుకు ఐఎఫ్‌ఎఫ్‌సీఓ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీని ప్రభుత్వం నియమించిందని చెప్పారు. వరిపంటకు ఎకరాకు రూ.80లు, పండు మిరపకు రూ.360లు, కందికి రూ.40లు, పత్తిపంటకు రూ.1900లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన రైతులు నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పత్తి రైతులు విధిగా బీమా చేసుకోవాలి బీమా ప్రీమియం చెల్లించేందుకు 31 వరకు గడువు పెంపు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
స్వాతంత్య్ర వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు..
నరసరావుపేట: స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు అధికారులు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై బుధవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్థానిక పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకల్లో.. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వేదికను అందంగా అలంకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల మార్చిఫాస్ట్‌లో ఎన్‌సీసీ కేడెట్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అదనపు ఎస్‌పీ జేవీ సంతోష్, డీఆర్‌ఓ అద్దెయ్య, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.