ఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికులు, గ్రామస్తుల దాడి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికులు, గ్రామస్తుల దాడి

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

దాడిని నిరసించిన డిపో జేఏసీ నాయకులు ఇక నుంచి మేరికపూడి గ్రామం గుండా బస్సులు తిప్పమని జిల్లా అధికారికి స్పష్టం చేసిన వైనం దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

నరసరావుపేట: స్థానిక ఆర్‌టీసీ డిపో కండక్టర్‌ జి.పూర్ణచంద్రరావుపై ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో బుధవారం దాడి జరిగింది. దీనిని నిరసిస్తూ డిపో జేఏసీ నాయకులు నరసరావుపేట–గుంటూరు మార్గంలో తిరిగే పల్లెవెలుగు బస్సులను గ్రామం నుంచి కాకుండా బైపాస్‌గుండా మాత్రమే తిప్పుతామని, దాడిచేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీపీటీఓ టి.అజితకుమారికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై యూనియన్‌ నాయకుడు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు గుంటూరు బస్టాండ్‌లో పాయింట్‌ లో నిలిపే సమయంలో బస్సుకు ఎదురుగా వచ్చి ఎక్కే ప్రయత్నం చేసిన ఏబు అనే ప్రయాణికుడిని కండక్టర్‌ పూర్ణచంద్రరావు వారించారన్నారు. దీంతో కండక్టర్‌పై వాగ్వివాదానికి దిగిన ఏబును అక్కడే ఉన్న బస్టాండ్‌ అవుట్‌ పోస్ట్‌ పోలీసులు తప్పని చెప్పి కౌన్సెలింగ్‌ ఇచ్చి అదే బస్సు ఎక్కించి పంపారన్నారు. దారిపొడవునా కండక్టర్‌ను బెదిరిస్తూ తన స్వగ్రామమైన మేరికపూడిలోని తన మిత్రులు, బంధువులకు సమాచారం ఇచ్చాడన్నారు. బస్సు మేరికపూడి గ్రామానికి చేరుకునే సమయానికి సుమారు 50 మంది మహిళలు, పురుషులు బస్సుకు అడ్డు నిలబడి ఆపారన్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బస్సులో వెనక భాగాన టిక్కెట్లు ఇస్తున్న కండక్టర్‌ పూర్ణచంద్రరావుపై విచక్షణారహితంగా దాడిచేసి టిక్కెట్లు ఇచ్చే టిమ్‌ మిషన్‌, క్యాష్‌ బ్యాగ్‌, ఫోన్‌ లాక్కొని కొట్టారన్నారు. ప్రయాణికుల నుండి వసూలు చేసిన క్యాష్‌ బ్యాగ్‌లోని డబ్బులు, ప్రభుత్వ ఆస్తిఅయిన టిక్కెట్లు ఇచ్చే మిషన్‌ను అపహరించారన్నారు. బస్సులోని ప్రయాణికుల సహాయంతో కండక్టర్‌, డ్రైవర్‌ ఫిరంగిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, క్షతగాత్రుడైన కండక్టర్‌ నరసరావుపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆర్టీసీ అన్ని యూనియన్‌ నాయకులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా వారికి కఠిన శిక్షలు విధించాలని ఆర్టీసీ యాజమానం, పోలీసులు, ప్రభుత్వానికి నాయకులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement