నకరికల్లు: నకరికల్లు శివారు ఎస్సీ కాలనీలో కొంతమంది వ్యక్తులు కోతముక్క పేకాట ఆడుతుండగా ఎస్‌ఐ కె.సతీష్, సిబ్బందితో దాడి చేసి నలుగురు వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 3 మొబైల్ ఫోన్‌లు, రూ.5,770 నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పిడుగురాళ్ల: రోడ్డుపై నడుస్తున్న మహిళను వెనుక నుంచి టిప్పర్ ఢీకొనటంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన పట్టణంలోని బైపాస్ రజక కాలనీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....బుడిగందుల రమణ రజక కాలనీ నుంచి విజయవాడ వెళ్లేందుకు బైపాస్‌లో బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రమణ (51) అక్కడిక్కడే మృతి చెందింది. రమణ కుమార్తె ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణ గత కొంత కాలంగా భర్త చనిపోవటంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. ఆమె కుమార్తె ప్రభావతి కూడా తల్లి రమణ వద్దనే ఉంటుంది.
పిడుగురాళ్ల: లారీని రోడ్డు పక్కన ఆపి టైర్లు పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొనటంతో ఆగి ఉన్న లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని బైపాస్ రైల్వే బ్రిడ్జి సమీపంలో అర్థరాత్రి జరిగింది. పట్టణ ఎస్‌ఐ డి.శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు...రాయపూర్ నుంచి చైన్నె వెళ్తున్న లారీని డ్రైవర్ నిద్ర రావటంతో రోడ్డు పక్కన ఆపాడు. ఆపిన తర్వాత టైర్లు పరిశీలిస్తుండగా హైదరాబాద్ నుంచి చైన్నె వెళ్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఆగి ఉన్న లారీ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావటంతో పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని పేర్కొన్నారు.
గద్వాల క్రైం: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..పల్నాడు జిల్లా మల్లాది గ్రామానికి చెందిన సునీల్ (24) మూడు నెలల క్రితం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా చేరాడు. సోమవారం తెల్లవారుజామున సొంతూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు బైక్‌పై వెళ్తుండగా వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీల్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సునీల్ తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి కారకుడైన వ్యక్తి గద్వాలకు చెందిన సత్యారెడ్డిగా గుర్తించినట్లు సమాచారం.
మద్యం మత్తే కారణమా?
మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ అతి వేగంతో బైక్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కారులో ప్రమాదానికి కారకుడైన వ్యక్తితోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కారు నిలపకుండా తప్పించుకున్నారని వివరించారు.
సత్తెనపల్లి: రైల్వేట్రాక్ పై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పట్టణ పోలీసులు కాపాడిన సంఘ టన సోమవారం రాత్రి పట్టణ శివారులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండ లం పాకాలపాడు గ్రామానికి చెందిన పోతల మరియబాబు కుటుంబ సమస్యల నేపథ్యంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు యత్నిస్తుండగా డయల్ 100 ద్వారా వచ్చిన సమాచారం మేరకు పట్టణపోలీస్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు రాజేష్ కన్నా హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మరియబాబును కాపాడారు. సత్వ రమే స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు రాజేష్ కన్నాలను పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): విద్యుత్ షాక్‌కు కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటీ అగ్రహారానికి చెందిన కావలి రామకృష్ణ (45) ఐపీడీ కాలనీ పరిసర ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఐపీడీ కాలనీలో కేబుల్ వైర్ల మరమ్మతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ వైర్ రామకృష్ణపై పడింది. విద్యుత్ షాక్‌కు గురైన రామకృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


