● విద్యార్థుల ఉజ్వల భవితకు ఇన్‌స్పైర్ ● సెప్టెంబర్ 15 వరకు నమోదుకు గడువు
సత్తెనపల్లి: పరిశోధనలపై విద్యార్థుల ఆసక్తిని పెంచి వారిని పాఠశాల స్థాయి నుంచే రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) ప్రతి ఏటా పాఠశాల ఉన్నత స్థాయి విద్యార్థులకు ఇన్‌స్పైర్ మనాక్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుల నామినేషన్స్‌ను ఆహ్వానిస్తోంది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. వీరంతా తమ సైన్స్ టీచర్స్‌ను గైడ్‌గా ఏర్పాటు చేసుకొని పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు.
ప్రోత్సాహకాలు...
జిల్లా స్థాయిలో ఇన్‌స్పైర్ మనాక్‌లో ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో నుంచి 10 శాతం రాష్ట్ర స్థాయికి పంపుతారు. రాష్ట్ర స్థాయిలో ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో నుంచి కూడా 10 శాతం ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపుతారు. అత్యుత్తమ ప్రాజెక్టుల్లో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై తే రాష్ట్రపతి భవన్ సందర్శనతోపాటు జపాన్ దేశానికి వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూ.25 వేల నిధులు మంజూరు చేస్తుంది. ఈ దరఖాస్తుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉంది.
దరఖాస్తు చేసుకునే విధానం ఇలా..
ఇన్‌స్పైర్ మనాక్ అవార్డులో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌స్పైర్‌అవార్డ్స్.డీఎస్‌టీ.గౌ.ఇన్ ద్వారా వెబ్‌సైట్ తెరవాలి. స్కూల్ అథార్టీ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచి సేవ్ చేయాలి. సంబంఽధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ఆ ఐడీతో పాస్‌వర్డు క్రియేట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదు చేయాలి. (లేదా) ఇన్‌స్పైర్ మనాక్ యాప్‌లో విద్యార్థి ఆధార్ నెంబర్,బ్యాంకు వివరాలు, పాస్‌పోర్టు సైజు ఫోటో ద్వారా స్కూల్ లాగిన్‌లో ఓపెన్ చేసి ప్రాజెక్టు వివరాలు నమోదు చేయాలి. అది కూడా 100 లోపు పదాలు ఉండేటట్లు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


