నరసరావుపేట: దస్తావేజు లేఖరుల పనిని ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను ఉపసంహరించుకువరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఏపీ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు, నరసరావుపేట సీనియర్ డాక్యుమెంట్ రైటర్లు సింగం యోగాంజనేయశర్మ, పిల్లుట్ల వెంకటరమణమూర్తి తెలిపారు. దస్తావేజుల లేఖరుల పెన్‌డౌన్ సందర్భంగా ప్రకాష్‌నగర్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆదివారం జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశం నిర్వహించారు. యోగాంజనేయశర్మ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జీవో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఆస్తి గొడవలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్నారు. జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖరులు ఆయా స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రలు సమర్పిస్తామన్నారు. ఆరు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజలు తమకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారన్నారు. పిల్లుట్ల రమణమూర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ విభాగంలో ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రతి మార్పునకు సహకరించామన్నారు. ఈ జీవో అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని హెచ్చరించారు. నరసరావుపేట సంఘ అధ్యక్షుడు నాగభూషణరావు, ప్రధాన కార్యదర్శి జేవీ సుబ్బాచార్యులు, జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.


