వాలీబాల్ కోచ్‌గా ప్రత్యేకత చాటుతున్న శ్రీనివాసరావు
యడ్లపాడు: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్ కోచ్ నక్కా శ్రీనివాసరావు అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. దేశం తరఫున చైనాలో నిర్వహించిన కోచ్‌ల శిక్షణ కోర్సు పూర్తి చేసి అంతర్జాతీయ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. లింగారావుపాలెం జెడ్పీహైస్కూల్ పూర్వ విద్యార్థి నక్కా శ్రీనివాసరావుకు చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి మెండు. వాలీబాల్ క్రీడాకారుడిగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. కోచ్‌గా తర్ఫీదు ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో జూలై 16 నుంచి 24వ తేదీ వరకు చైనాలో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ డెవలప్‌మెంట్ లెవెల్–3 కోచెస్ కోర్సు కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ కోర్సుకు సంబంధించి శ్రీనివాసరావును వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టీరింగ్ కమిటీ ఎంపిక చేసింది. చైనా వాలీబాల్ అసోసియేషన్ వద్దకు పంపింది. చైనా నుంచి అధికారిక ఆహ్వానం పొందిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వాలీబాల్ అభిమానుల సహకారంతో చైనాకు వెళ్లాడు. ఇంటర్నేషనల్ కోచ్‌గా శిక్షణ విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ మేరకు ధ్రువీకరణ పత్రం పొందాడు. ఆయన్ను గ్రామప్రజలు అభినందించారు.


