తాడికొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను టిప్పర్ వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో భార్య మృతిచెందగా.. భర్త గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన భార్యాభర్తలు గురువారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా తుళ్లూరు మండలం రాయపూడి వద్ద వెనుకనుంచి వచ్చిన టిప్పర్ వీరి బండిని ఢీకొట్టడమే కాకుండా.. కొంతమేరకు ఈడ్చుకువెళ్లింది. ఘటనలో భార్య డేగల వెంకాయమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి
గుంటూరువెస్ట్:జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచే యాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, పైప్‌లైన్ నిర్మాణం, గృహ కనెక్షన్లు, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, పెండింగ్ పనులపై జేసీ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా అన్ని పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేసే తాగునీరు నాణ్యంగా ఉండేలా వాటర్ క్వాలిటీ టెస్టింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.


