చంద్రబాబు మార్కు రాజకీయాలు జిల్లాలో 3,11,102 మంది విద్యార్థులు 2,65,686 మందికే ఆర్థిక సాయం స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయాలకు పరుగులు తీస్తున్న అర్హులు
విద్యుత్ బిల్లు లెక్కలోకి తీసుకోవద్దు
నా భర్త పేరు షేక్ జాని. లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేను టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నడుపుకొస్తున్నా. మా కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఏడేళ్ల క్రితం సొంత ఇంటి నిర్మాణానికి రుణం అవసరమై ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశాం. కేవలం రూ.1,100 చెల్లించాం. అప్పటి ప్రభుత్వ నిబంధన ప్రకారం అమ్మఒడి తొలగించారు. వెంటనే ఆదాయపు పన్ను చెల్లించట్లేదని సర్టిఫికెట్ దాఖలు చేశాం. ఈ కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసినా కూడా తల్లికి వందనం కింద సాయం అందడం లేదు. మా బాబుకు సాయం అందించాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– షేక్ షాకీరా, ఏడో వార్డు, నరసరావుపేట
సత్తెనపల్లి: బూటకపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో సామాన్యులకు తీరని అన్యాయం చేస్తోంది. మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని నాడు కూటమి నేతలు చెప్పారు. రూ.13 వేలను మాత్రమే అందిస్తున్నారు. అదీ జిల్లాలో వేల మందికి అందడం లేదు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 3,11,102 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందరికీ రూ.13 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో రూ.404.43 కోట్లు జమ చేయాలి. జిల్లాకు రూ.345.39 కోట్లు మాత్రమే కేటాయించారు. ఫలితంగా 2,65,686 మంది విద్యార్థులు మాత్రమే పథకానికి అర్హత సాధించారు. 1,84,075 మంది తల్లులు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. నిబంధనల పేరుతో 45,416 మంది పథకానికి దూరమైపోయారు. వారి తల్లులు రూ.59.04 కోట్లు కోల్పోయారు.
ఫస్ట్ క్లాస్, ఇంటర్ వారికి ఎగనామం...
జిల్లాలో ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ఎగనామం పెట్టారు. జిల్లాలో ఒకటో తరగతి 26,917 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరం 15,951 మంది చదువుతున్నారు. వీరికి నగదు ఎప్పుడు ఇస్తారో ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వాలు అమలు చేసే ఏ పథకాలకై నా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హుల జాబితా సిద్ధం చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వమే అనర్హులంటూ కొందరి జాబితా సిద్ధం చేసి సచివాలయాల్లో పెట్టేస్తోంది. ఫలితంగా వేలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం పొందిన వారిని కూడా ప్రస్తుతం అనర్హులు జాబితాలో చేర్చడం గమనార్హం.
రూ. 2 వేలు చొప్పున మినహాయించి....
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసమని అమ్మ ఒడి పథకం పొందిన ఒక్కో విద్యార్థి నుంచి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.వేయి చొప్పున కేటాయించింది. ఆ విషయంపై చంద్రబాబు, లోకేష్ తదితర నేతలు, ఎల్లో మీడియా నానా యాగీ చేశాయి. ఇప్పుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2 వేల చొప్పున తీసుకుంటున్నారు. పథకంలో నగదు మొత్తాన్ని పెంచకపోగా కోత విధించారు. ఈ ఏడాది 2,65,686 మంది విద్యార్థుల నుంచి రూ. 2 వేల చొప్పున రూ.53.13 కోట్లను పాఠశాలల నిర్వహణ కోసం మినహాయించారు.
నిబంధనల పేరుతో...
సంక్షేమ పథకాల అమల్లో కనీస చిత్తశుద్ధి లేని చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం అర్హుల ఎంపికలో సచివాలయాల స్థాయి నుంచే కోతలు విధించింది. ముఖ్యంగా మ్యాపింగ్ సమయంలో జరిగిన తప్పిదాలు లబ్ధిదారులకు పెను శాపంగా మారాయి. అద్దె ఇళ్లల్లో ఉన్న వారి ఆధార్ కార్డులను కూడా ఆ ఇంటి ఆస్తి పన్ను, విద్యుత్ మీటర్‌తో లింక్ చేయడంతో ఆస్తి లేకున్నా ఉన్నట్లు చూపిస్తోంది. ఫలితంగా వేల మంది అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయారు. లబ్ధిదారుల ఆధార్ నెంబర్‌తో పరిశీలిస్తే ఆస్తి ఉన్నట్లు చూపిస్తోంది. ఆ లింక్ తొలగించడానికి సచివాలయ సిబ్బంది నిరాకరిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై దృష్టి సారించడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే పథకానికి అనర్హులని తేల్చేశారు. చాలా మంది అంత కంటే తక్కువ విద్యుత్తు వినియోగించినా సరే అర్హుల జాబితాలో పేరు లేదు. మరోవైపు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సైతం అనర్హుల జాబితాలో చేర్చారు.
విద్యుత్ బిల్లు పరిగణనలోకి తీసుకోవడం వల్ల మా బాబుకు తల్లికి వందనం కింద సాయం అందలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి విద్యుత్ బిల్లులను లెక్కలోకి తీసుకునే నిబంధన ఎత్తివేయాలి. మా అబ్బాయి పీసపాటి కాలేష్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది తల్లికి వందనం కింద సాయం అందింది. ఈ ఏడాది విద్యుత్ బిల్లులు పరిగణనలోకి తీసుకోవడం వల్ల పడలేదు.
– పీసపాటి దర్యాబీ, రెడ్డిగూడెం
నా కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా రెండేళ్లుగా తల్లికి వందనం డబ్బులు ఖాతాలో జమ కావట్లేదు. నా కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. ఆన్‌లైన్‌లో మా ఆధార్ నంబర్లు తప్పు వేశారు. డబ్బులు షేక్ హసీనా అనే మహళ పేరుపై పడ్డాయి. అర్జీ పెడితే సరిదిద్దే ఆప్షన్ లేదన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి.
– బోరుగడ్డ పార్వతి, నరసరావుపేట పట్టణం
అర్హులకు అందని రూ.15 వేలు


