● జిల్లాలో 2,65,686
మంది విద్యార్థులు గుర్తింపు
● వాస్తవానికి దాదాపు
3 లక్షల మందికిపైగా అర్హులు
నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయటంలో కొందరు అర్హులైన వారికి కూడా సాయం అందలేదని విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వం బుధవారం తల్లికి వందనం నిధులను విడుదల చేసింది. పల్నాడు జిల్లా పరిధిలో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు దాదాపు 2.99 లక్షల మంది ఉన్నారు. వీరితో పాటు ఇంటర్ విద్యార్థులు మరో 30 వేల మంది ఉంటారని అంచనా. జిల్లా పరిధిలో అర్హత కలిగిన విద్యార్థులు 2,65,686 మంది ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. అర్హులైన తల్లులు 1,84,075 అని లెక్కలు తేల్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం నగదు జమ చేస్తామని ప్రకటించారు. లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఖాతాలో నగదు చేస్తామని కూటమి ఎన్నికల హామీగా పేర్కొంది. రూ.13 వేలే తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు.
అర్హత ఉన్నా అందలేదు...
జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షలకుపైగా అర్హత గల విద్యార్థులు ఉండగా ప్రభుత్వం మాత్రం 2,65,686 మంది అర్హులని పేర్కొంటోంది. వీరికి దాదాపు రూ.368 కోట్లు జమ కానున్నాయి. మరో రెండు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. గత ఏడాది అర్హత గల వారిని ఇప్పుడు అనర్హులుగా పేర్కొంటూ జమ చేయలేదు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లుల ఖాతాలో ఒక్కో చోట ఒక పిల్లాడికి మాత్రమే జమ చేశారు. దీంతో తల్లిదండ్రులు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. సాంకేతిక కారణాల వలన నగదు జమ కాలేదని, రికార్డులను పరిశీలించి రెండవ విడతలో నగదు జమ చేస్తామని చెబుతున్నారు.


