ఆర్థిక వివాదాలే కారణం
నరసరావుపేట టౌన్: భర్తపై భార్య కత్తితో దాడికి పాల్పడి సంఘటన మంగళవారం అర్థరాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు గంటా లలిత కాలనీలో నివాసం ఉంటున్న చట్టు కోటేశ్వరరావు అరండల్‌పేటలో పెట్‌షాప్ నిర్వహిస్తుంటాడు. మొదటి భర్తతో విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న ఆయన కాసా రామలక్ష్మిని మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆమె గుంటూరు రోడ్డులో వస్త్రదుకాణం నిర్వహిస్తుంది. మరో వ్యక్తితో భార్య సన్నిహితంగా మెలుగుతుందని భర్తకు అనుమానం ఉంది. దీంతోపాటు భార్య, భర్తల మధ్య ఆర్థిక వివాదం తలెత్తి కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కోట సెంటర్ నుంచి ద్విచక్రవాహనంపై గుంటూరు రోడ్డు మీదుగా లలితా కాలనీకు కోటేశ్వరరావు బయలు దేరాడు. మార్గ మధ్యలో కాసా రామలక్ష్మి మరో ఇద్దరు వచ్చి అడ్డగించారు. కత్తితో కోటేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడిని నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితుడు బుధవారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సిహెచ్ ప్రభాకర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల భాగ్యనగర్ కాలనీ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రఘురామ్‌నగర్ ఏరియాకి చెందిన చెరుకూరి నరేష్ (35) పట్టణంలోని కట్టమూరువారివీధిలో గల నాని డ్రెస్సెస్‌లో గుమస్తాగా పనిచేస్తు జీవనం వెళ్లదీస్తున్నాడు. ప్రధాన రహదారిలోని గడియార స్తంభం సెంటర్‌లో గల శ్రీ విజయదుర్గ డ్రెస్సెస్ దుకాణ యజమానురాలు కనికుట్ల రాజ్యలక్ష్మిని నరేష్ తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ధూళిపాళ్ల నుంచి సత్తెనపల్లి వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ లారీని ఢీకొట్టారు. నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రాజ్యలక్ష్మిని సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మృతడికి భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెదకూరపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నెగండ్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కన్నెగండ్ల గ్రామానికి చెందిన వేదులాపురపు ఆనంద్(54) మంగళవారం వ్యక్తిగత పనుల నిమిత్తం పెదకూరపాడు వచ్చారు. పనులు ముగించుకుని రాత్రి పది గంటల సమయంలో కన్నెగండ్ల గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో లగడపాడు దాటిన తర్వాత ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కింద పడ్డాడు. తల రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వ్యాపార పనులు ముగించుకున్న అటువైపుగా వెళుతున్న కొందరు గుర్తించి 108కి సమాచారం అందించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఒక కుమార్తె, కుమారులు ఉన్నారు. కొంత కాలం కిందటే భార్య మృతిచెందింది. ఆనంద్ మృతదేహాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అర్తిమల్ల రమేష్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
విషపు గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్య
మాచవరం: మద్యంలో విషపు గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వేమవరం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొమరగిరి శ్రీను(57) చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై మంగళవారం ఉదయం మద్యంలో విషపు గుళికలు కలుపుకొని సేవించాడు. కొంతసేపటి తర్వాత నోటి నుంచి దురద రావడంతో అతని తమ్ముడు వీరయ్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందా డు. వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అందని జూలై నెల రేషన్
బొల్లాపల్లి: మండలంలోని బండ్లమోటు రేషన్ దుకాణం పరిధిలో జూలై నెల రేషన్ పంపిణీ చేపట్టలేదని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్ షాప్ పరిధిలో బండ్లమోటుతోపాటు శివారు గ్రామం మాలపాడుకు చెందిన సుమారు 450కి పైగా కార్డుదారులు ఉన్నారు. ఈ విషయంపై పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ పి సునీతను వివరణ కోరగా ఈనెల 2న బండ్లమోటు రేషన్ షాప్ తనిఖీ చేశామని, సుమారు 25 క్వింటాల బియ్యం వ్యత్యాసం ఉందని తెలిపారు. 6ఎ కేసు నమోదు చేశామని తెలిపారు.


