గొర్రెల కాపరిపై టీడీపీ నాయకుడి దాడి | - | Sakshi
Sakshi News home page

గొర్రెల కాపరిపై టీడీపీ నాయకుడి దాడి

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

పిడుగురాళ్ల: గొర్రల కాపరిపై టీడీపీ నాయకుడు దాడి చేసి గాయపరిచిన సంఘటన పిడుగురాళ్ల మండలం వీరాపురంలో బుధవారం జరిగింది. బాధితుడు తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన పూసలపాడు బాలప్ప. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సుమారు మధ్యాహ్న సమయంలో వీరాపురం గ్రామంలో గొర్రెలు మేత మేస్తున్నాయి. వీరాపురం గ్రామ టీడీపీ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు నారుమడిలోకి గొర్రెలు వచ్చాయని గొర్రెల కాపరులైన బాలప్ప, తిమ్మప్పలపై గొడవకు దిగాడు. గొర్రెల కాపరులు బతిమిలాడినా వినకుండా తన చేతిలో ఉన్న కర్రతో బాలప్ప తలపై బలంగా కొట్టాడు. తలపగిలి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వటంతో గురజాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స పొందారు. బాధితుడు పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌కు హాజరై నాదెండ్ల భాస్కర్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌ పేర్కొన్నారు.

వ్యభిచార గృహంపై దాడి

నరసరావుపేట టౌన్‌: వ్యభిచార గృహంపై దాడి నిర్వహించి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌ బుధవారం తెలిపారు. రామిరెడ్డిపేట పాతసమితి ఆఫీస్‌ సమీపంలోని ఓ అద్దె గృహంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది. ఆ గృహంపై దాడులు నిర్వహించి అక్కడ వ్యభిచార నేరానికి పాల్పడుతున్న మహిళ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.

పట్టపగలు ఇంట్లో చోరీకి యత్నం

ఈపూరు: పట్టపగలే ఓ ఇంటిలోకి ప్రవేశించి చోరీ చేస్తున్న దొంగలను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తు కాగితాలు ఏరుకుంటూ సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు బ్రహ్మం గారి గుడి వద్ద తాళం వేసి ఉన్న ఓ ఇంటి కిటికీ ఇనుప గ్రిల్స్‌ను తొలిగించి లోపలికి ప్రవేశించారు. రాగి, ఇత్తడి, స్టీలు వస్తువులను తీసుకుని వెళుతున్నారు. పక్క ఇంటి వారు గుర్తించి కేకలు వేశారు. దీంతో దొంగలు వస్తువులు అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. గ్రామస్తులు వారిని వెంబడించగా సమీపంలోని మొక్కజొన్న పొలంలో దాక్కున్నారు. ఇది గమనించి పట్టు కోబోగా ఇద్దరు తప్పించుకుని పారిపోగా మిగి లిని పట్టుబడ్డారు. దొంగతనానికి వచ్చిన వారి లో ఇరువురు పురుషులు కాగా ఇద్దరు మహి ళలు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దొంగలను అదుపులోనికి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో జరిమానా

దుర్గి: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా దుర్గి పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలలో మండలంలోని రాజా నగరానికి చెందిన చల్లంచర్ల హరి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దుర్గి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ గోపాల్‌ వారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి, నిందితుడిని మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఓ.నాగభూషన్‌ ముందు హాజరుపర్చారు. విచారణ అనంతరం నిందితులు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.

హాస్టల్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

సత్తెనపల్లి: హాస్టల్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థిని ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... ఈ నెల 15వ తేదీన వార్డెన్‌ అనుమతి తీసుకొని శుభకార్యం ఉండడంతో తన మేనమామతో కలసి బాలిక మాచర్ల వెళ్లింది. 20వ తేదీన కుమార్తెను వెంటబెట్టుకొని తల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్దకు వచ్చింది. బాగా చదువుకోవాలని కుమార్తెకు సూచించింది. తాను చదువుకోనని, మాచర్ల వస్తానంటూ బాలిక మొండికేసింది. ఎంత బతిమిలాడినా కుమార్తె మాట వినకపోవడంతో తల్లి ఆమె చెంపలపై రెండు దెబ్బలు వేసి లోపలికి పంపింది. పాఠశాల ముగిసిన తర్వాత సోప్‌ కొనుక్కోవాలని స్నేహితులకు చెప్పి బజారుకు వెళ్లిన విద్యార్థిని ఎలుకల మందు కొనుక్కొని వసతి గృహానికి చేరుకొంది. రాత్రి సమయంలో ఎలుకల మందు కొంత తినడంతో ఆమెకు రెండుసార్లు వాంతులయ్యాయి. ఈ నెల 21వ తేదీన ఉదయాన్నే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయ న మందులు ఇచ్చాడు. కొద్దిసేపటికి ఎలుకల మందు తిన్నానని స్నేహితులతో చెప్పడంతో వారు విషయాన్ని వార్డెన్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు ఆ విద్యార్థినిని తరలించారు. వైద్యులు అరగంటపాటు ఐసీయూలో ఉంచి అన్ని పరీక్షలు చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో జనరల్‌వార్డుకు తరలించారు. తల్లితో పాటు కుటుంబసభ్యులు వైద్యశాలకు చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement